ధర్మపురి ఆలయాల అభివృద్ధికి రూ.200 కోట్లు: భట్టి
•పురాతన ఆలయాల సంరక్షణకు కట్టుబడి ఉన్నాం
•పలు అభివృద్ధి పనులకు మంత్రి అడ్లూరితో కలిసి శంకుస్థాపన
•ధర్మపురి పుష్కరాలకు మరో 80కోట్లు మంజూరు
•ధర్మపురి పర్యటనలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క
ధర్మపురి,సెప్టెంబర్7 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పురాతన ఆలయాల సంరక్షణకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) నాయకత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లోని శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఉగ్ర నరసింహ స్వామి పునర్నిర్మాణ పనులకు సోమవారం తెల్లవారుజామున రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు లతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మంత్రులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముందుగా ఉగ్ర నరసింహ స్వామి ఆలయంలో ఉపముఖ్యమంత్రి తో పాటు మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడిన తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్నామని అన్నారు. 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
ఇందులో భాగంగా బాసర నుండి భద్రాచలం వరకు ఉన్న ప్రముఖ ఆలయాలను అభివృద్ధి చేయడంతో పాటు పుష్కరాలకు వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పుష్కరాల పనులు నిర్వహించడానికి బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి, కోటిలింగాల క్షేత్రాల అభివృద్ధికి రూ. 200కోట్లు కేటాయించినట్లు భట్టి తెలిపారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ధర్మపురి ఉగ్ర నరసింహ స్వామి పునర్ నిర్మాణ పనుల ప్రారంభానికి రావడం అదృష్టంగా ఉందని ఉపముఖ్యమంత్రి అన్నారు.
అద్భుత కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు భట్టి విక్రమార్క అన్నారు. వచ్చే పుష్కరాలు నాటికి ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని భట్టి వివరించారు.ధర్మపురి లోని ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునర్ నిర్మాణ పనులకు ప్రభుత్వం రూ. 10 కోట్ల కేటాయించగా పనుల ప్రారంభానికి ఉపముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలో నూతనంగా రూ. 2.48 కోట్లతో ఏర్పాటు చేస్తున్న నూతన సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. 2027 గోదావరి పుష్కరాలకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ధర్మపురి వద్ద గోదావరిలో పుష్కర ఘాట్ల నిర్మాణానికి రూ. 22. 16 కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. ధర్మపురి, కోటి లింగాలలో రూ. 58.55 కోట్లతో తొమ్మిది రోడ్ల నిర్మాణ పనులకు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు.
ధర్మపురి నియోజకవర్గంలో నిర్వహించే గోదావరి పుష్కరాలకు మరో 80 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. గోదావరి పుష్కరాలకు ఇప్పటికే ధర్మపురి నియోజకవర్గానికి 117 కోట్లు విడుదల గాక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రూ. 80కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో ధర్మపురి నియోజకవర్గానికి గోదావరి పుష్కరాల నిధులు సుమారుగా 200 కోట్లకు చేరింది. ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు స్థానిక శాసనసభ్యుల,మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ తో పాటు జిల్లా అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు.






