‘భవిత’ మారుతున్న బతుకులు
- నాలుగు గోడల నుంచి నూతన భవిష్యత్తు వైపు అడుగులు
- ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల జీవితాల్లో వెలుగులు
- సాధారణ విద్యార్థులతో పోటీగా రాణిస్తున్న భవిత విద్యార్థులు
- వెలుగులు నింపుతున్న ప్రత్యేక విద్య
- జీవన నైపుణ్యాలు నేర్పిస్తూ భవిష్యత్తుకు బలమైన పునాదులు
చిట్యాల, జూలై 20 : ఒకప్పుడు ఇంటికే పరిమితమై, సమాజంలో కలవలేక, తమ భావాలను వ్యక్తపరచలేక మౌనంగా గడిపిన చిన్నారులు... నేడు చిరునవ్వుతో పాఠాలు నేర్చుకుంటూ, ఆటలు ఆడుతూ, తమ పనులు తామే చేసుకునే స్థాయికి చేరుకుంటున్నారు. దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వ సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ’భవిత’ కేంద్రాలు. నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని భవిత సెంటర్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కొత్త జీవితాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.
మండలంలో ప్రస్తుతం 103 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించారు. వారిలో 85 మంది భవిత కేంద్రానికి నిత్యం హాజరవుతున్నారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధి నుంచి 22 మంది, గ్రామీణ ప్రాంతాల నుంచి 81 మంది విద్యార్థులు ఇక్కడ సేవలు పొందుతున్నారు. ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించి, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించడం ఈ కేంద్రం ప్రత్యేకత.
ఫిజియోథెరపీ... స్పీచ్ థెరపీతో కొత్త ఆశలు.
మూడు నుంచి ఆరు సంవత్సరాల చిన్నారులకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ వంటి సేవలు అందిస్తున్నారు. నడవలేని పిల్లలకు నడకలో శిక్షణ, మాట్లాడడంలో ఇబ్బందులు ఉన్న వారికి నిపుణుల సహాయంతో స్పీచ్ థెరపీ అందిస్తున్నారు. ఆరు నుండి 18 సంవత్సరాల వయసుగలవారికి బోధన, ఆటలు, పాటలు, చిత్రాలు, బొమ్మల ద్వారా పిల్లలలో నేర్చుకునే ఆసక్తిని పెంచుతున్నారు.
పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా అండ.
కేంద్రానికి వచ్చే విద్యార్థులకు సమీప ప్రభుత్వ పాఠశాలల ద్వారా పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ప్రతి విద్యార్థికి నెలకు రూ.350 రవాణా భత్యం, వారిని కేంద్రానికి తీసుకొచ్చే తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు మరో రూ.350 అందిస్తున్నారు. ప్రత్యేక అవసరాలు గల బాలికలకు నెలకు రూ.200 స్టైఫండ్ ఇస్తున్నారు. అదనంగా ప్రభుత్వం రూ.6,000 స్కాలర్షిప్తో పాటు విద్యా స్థాయిని బట్టి రూ.9,000 నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు రూ.14,000 వరకు ప్రత్యేక ఉపకార వేతనాలు అందిస్తోంది.
ఆత్మవిశ్వాసమే అసలైన విజయం.
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు జాలి కాదు... అవకాశం అవసరమని భవిత కేంద్రం నిరూపిస్తోంది. పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, సమాజంలో గౌరవంగా జీవించే స్థాయికి తీసుకెళ్లేందుకు ఉపాధ్యాయులు, థెరపిస్టులు, తల్లిదండ్రులు సమష్టిగా కృషి చేస్తున్నారు. ప్రతి చిన్న పురోగతిని విజయంగా భావిస్తూ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నారు. ఒకప్పుడు తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందిన తల్లిదండ్రులు... ఇప్పుడు వారి చిన్న చిన్న విజయాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
భవిత కేంద్రం ద్వారా పిల్లల్లో వచ్చిన మార్పు కుటుంబాల్లో కొత్త ఆశలను నింపుతోంది. విద్య, వైద్యం, పునరావాసం, ఆత్మవిశ్వాసం అన్నింటినీ ఒకే వేదికపై అందిస్తున్న చిట్యాల భవిత కేంద్రం నిజంగా ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఆశాకిరణంగా నిలుస్తోంది. సరైన మార్గదర్శకత్వం, శిక్షణ, ప్రోత్సాహం ఉంటే ప్రతి చిన్నారి తన సామర్థ్యాన్ని చాటుకోగలడు అనే సందేశాన్ని చిట్యాల భవిత కేంద్రం సమాజానికి చాటిచెబుతోంది.
సాధారణ విద్యార్థులతో పోటీగా రాణిస్తున్న భవిత విద్యార్థులు.
భవిత కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ పొందుతున్న విద్యార్థులు కేవలం జీవన నైపుణ్యాలనే కాకుండా విద్యా రంగంలోనూ తమ ప్రతిభను చాటుతున్నారు. ప్రత్యేక ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, వ్యక్తిగత బోధన, తల్లిదండ్రుల సహకారంతో పదో తరగతి, ఇంటర్మీడియట్ వంటి పబ్లిక్ పరీక్షల్లో సైతం ఉత్తీర్ణత సాధిస్తూ తమ సామర్థ్యాన్ని నిరూపిస్తున్నారు. కొంతమంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తూ స్వయం ఉపాధి, ఉద్యోగాల వైపు అడుగులు వేస్తున్నారు. ప్రత్యేక అవసరాలు ఉన్నా, సరైన శిక్షణ, ప్రోత్సాహం లభిస్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చని భవిత కేంద్రాల విద్యార్థులు నిరూపిస్తున్నారు. వారి విజయాలు ఇతర ప్రత్యేక అవసరాల పిల్లలకు స్ఫూర్తిగా నిలవడంతో పాటు తల్లిదండ్రుల్లోనూ కొత్త ఆశలు నింపుతున్నాయి.
అంకితభావంతో పనులు చేస్తున్నాం
ప్రత్యేక అవసరాలు గల విద్యా ర్థుల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్నాం. ప్ర తి విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించి, ఎంతో సహనంతో ప్ర త్యేక బోధన అందిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం చే స్తున్నాం. ఉపాధ్యాయులుగా మాత్రమే కాకుండా తల్లిదండ్రుల్లా ప్రేమతో, ఆ ప్యాయతతో పిల్లలను తీర్చిదిద్దుతూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాము.
ఆవుల గీత , ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్, చిట్యాల.
మా పాపలో చాలా మార్పు కనిపిస్తుంది
మేము ప్రతిరో జూ ఆరెగూడెం గ్రా మం నుంచి మా పాపను భవిత సెం టర్కు తీసుకువస్తున్నాము. ఈ సెంట ర్లో చేరినప్పటి నుంచి మా పాప మానసిక ఆరోగ్యం, ప్రవర్తన, నేర్చుకునే సా మర్థ్యంలో చాలా మార్పు కనిపిస్తోంది. ఇక్కడ అందిస్తున్న ప్రత్యేక శిక్షణ, ఉపాధ్యాయుల శ్రద్ధ, ప్రేమాభిమానాలతో మా పాప ఎంతో మెరుగుపడింది.
కోరబోయిన మమత, దివ్యాంగ విద్యార్థిని తల్లి
పదో తరగతి పూర్తి చేశా
‘నేను భవిత సెంటర్లో ప్రత్యేక విద్యను అభ్యసించా. ఈ సెంటర్ అందించిన శిక్షణ, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పదో తరగతిని విజయవంతంగా పూర్తి చేశా. ప్రస్తుతం కూడా ఇదే సెంటర్ సహకారంతో పై చదువులు కొనసాగిస్తున్నాను. ఈ సెంటర్ నాకు విద్య మాత్రమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచింది. నా భవిష్యత్తుకు బలమైన పునాది వేసింది. నాలాంటి దివ్యాంగ విద్యార్థులకు భవిత సెంటర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
మత్స్యగిరి, దివ్యాంగ విద్యార్థి






