పొడ్చన్ పల్లి సర్పంచుకు పితృవియోగం
విద్యుదాఘాతంతో మృతి
పాపన్నపేట,జూలై21: మండల పరిధిలోని పొడ్చన్‌పల్లి గ్రామ సర్పంచ్ వెంకటయ్య (ఏసు)కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి ఏరోళ్ల కిష్టయ్య(56) మంగళవారం ఉదయం విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందారు. ఇంటి వద్ద సంపు నుంచి ట్యాంక్‌కు నీటిని ఎక్కించే ప్రయత్నంలో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏరోళ్ల కిష్టయ్య మంగళవారం ఉదయం ఇంటి వద్ద ఉన్న సంపు నుంచి మోటారు ద్వారా ఇంటిపై ఉన్న ట్యాంక్‌కు నీటిని ఎక్కించే ప్రయత్నం చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
సోమవారం రాత్రి కురిసిన వర్షం కారణంగా తడి వాతావరణంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ విషయం గమనించిన కుటుంబీకులు వెంటనే చికిత్స నిమిత్తం మెదక్ లోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి, కుటింబీకుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మృతుడికి భార్య కమలమ్మ, ఇరువురు కుమార్తెలు, స్థానిక సర్పంచ్ ఏసు కుమారుడు సంతానం ఉన్నారు.






