18 April, 2026 | 4:22 PM

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

05-06-2025 07:59 PM

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్..

ములుగు (విజయక్రాంతి): భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.(District Collector Divakara T.S.) సూచించారు. గురువారం ములుగు మండలం ఇంచర్ల గ్రామం రైతు వేదికలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూ భారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ, రైతుల సందేహాలను నివృత్తి చేశారు.

భూ సమస్యలు పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తోందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటికే వెంకటాపూర్ మండలంలో పైలెట్ ప్రాతిపదికన రెవెన్యూ సదస్సులు జరిపి, క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశామని అన్నారు. ప్రస్తుతం జిల్లాలోని మిగతా 09 మండలాల్లో గల అన్ని రెవెన్యూ గ్రామాలలో ఈ నెల 20వ తేదీ వరకు సదస్సులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు.

భూ రికార్డులలో పేరు తప్పులు,విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్-బిలో చేర్చిన భూముల సమస్యలు భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు సదస్సులలో స్వీకరించి భూభారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిర్దేశిత గడువు లోపు సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. నిర్ణీత షెడ్యూల్ ను అనుసరిస్తూ ఆయా గ్రామాలలో అధికారులు ఉదయం నుండి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. రెవెన్యూ సదస్సుల్లో ప్రభుత్వపరంగా నిర్ణీత ప్రొఫార్మాలో ప్రింట్ చేసిన దరఖాస్తులను అందజేయడం జరుగుతుందని అన్నారు.