జకోవిచ్‌కు బిగ్ షాక్
యూఎస్ ఓపెన్ నుంచి ఔట్
తొలి రౌండ్‌లోనే ఓటమి
కన్నీళ్లు పెట్టుకున్న సెర్బియన్ స్టార్
న్యూయార్క్, ఆగస్టు 31: ఏడాది చివరి గ్రాండ్ స్లామ్ యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం నమోదయింది. టైటిల్ ఫేవరెట్ నో వాక్ జకోవిచ్‌కు షాక్ తగిలింది. ఈ సెర్బియన్ స్టార్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. తొలి రౌండ్‌లో అర్జెంటీనా ఆటగాడు మరియానో నవోనె చేతిలో ఐదు సెట్ల పోరులో జకోవిచ్ ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఉత్కంఠ భరిత పోరులో జకోవిచ్ 6-7, 7-5, 6-4, 2-6, 1-6తో నవోనె చేతిలో పరాజయం పాలయ్యాడు. మ్యాచ్ మొదలైనప్పటి నుంచే జకోవిచ్ తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. న్యూయార్క్‌లోని ఉక్కపోత వాతావరణం అతడిని ఇబ్బంది పెట్టింది. మ్యాచ్ మూడో సెట్‌కు చేరుకునేసరికి పరిస్థితి మరింత దారుణంగా మారింది.
ఆరో గేంలో జకోవిచ్ పలుమార్లు వాంతులు చేసుకున్నాడు. తొలి సెట్ను టై బ్రేక్‌లో కోల్పోయి న జకోవిచ్ అద్భుతంగా పుంజుకున్నాడు. రెండో సెట్‌ను 7-5తో, మూడో సెట్‌ను 6-4తో గెలుచుకుని మ్యాచ్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే నవోనె మాత్రం వెనక్కి తగ్గలేదు. నాలుగో సెట్‌లో జకోవిచ్‌పై పూర్తి ఆ ధిపత్యం ప్రదర్శించిన అతడు 6-2తో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఐదో సెట్‌లోనూ నవోనె 4-1 ఆధిక్యంలోకి వెళ్లడంతో జకోవిచ్ పూర్తిగా నీరసించినట్లు కనిపించాడు.
ఈ సమయంలో కోర్టులోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. గంటల తరబడి వేడి, ప్రత్యర్థి దూకుడుతో పోరాడిన అనంతరం మ్యాచ్ తన చేజారిపోతుండటాన్ని తట్టుకోలేక భావోద్వేగానికి గురయ్యాడు. చివరికి నవోనె ఐదో సెట్‌ను 6-1తో గెలిచి మ్యాచ్‌ను ముగించాడు. ఈ పరాజయంతో గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో జకోవిచ్ 78 వరుస తొలి రౌండ్ విజయాల పరంపరకు తెరపడింది. దీంతో రికార్డు స్థాయి లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలన్న అతడి ఆశలు నెరవేరలేదు.






