1 September, 2026 | 1:58 AM

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉంటుందా?

01-09-2026 01:08 AM

ఫ్రాంచైజీల అభిప్రాయం కోరిన బీసీసీఐ

వచ్చే సీజన్‌కు ముందు తుది నిర్ణయం

ముంబై, ఆగస్టు 31: ఐపీఎల్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు మూడేళ్ల క్రితం బీసీసీఐ తీసుకొచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ నిబంధన అమల్లోనే ఉన్నప్పటికీ, రాబోయే ఐపీఎల్ సీజన్ల కోసం దీనిని కొనసాగించాలా లేదా రద్దు చేయాలా అనే అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది.

రాబోయే సీజన్ల దృష్ట్యా, ఈ నిబంధనపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని మొత్తం 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలను బీసీసీఐ కోరింది. ఫ్రాంచైజీల నుంచి వచ్చే ఈ ఫీడ్‌బ్యాక్, నివేదికలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే, ఈ రూల్‌ను కొనసాగించాలా లేదా అనేదానిపై బీసీసీఐ ఒక అధికారిక ప్రకటన చేయనుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల జట్లలో ప్రత్యేకంగా ఉండే ఆల్‌రౌండర్ల ప్రాధాన్యత, ప్రా ముఖ్యత తగ్గుతోందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.

అదనపు బ్యాటర్ల వల్ల బ్యాటింగ్ జట్లు విధ్వంసకరంగా ఆడుతుండటంతో బౌలర్లకు ఇది తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శుభ్మన్ గిల్ వంటి వారు ఈ రూల్‌ను ఇప్పటికే బహిరంగంగా వ్యతిరేకించారు. క్రికెట్ అనేది 11 మందితో ఆడే ఆట అని, 12 మందితో కాదని రోహిత్ శర్మ గతంలో వ్యాఖ్యానించారు. మ్యాచ్‌లో అదనంగా ఒక బ్యాటర్ లేదా బౌలర్ రావడం వల్ల బ్యాట్- బంతి మధ్య ఉండాల్సిన సమతుల్యత దెబ్బతింటోందని, బౌలర్లకు ఇది మరింత సవాల్‌గా మారుతోందని విమర్శలు వస్తున్నాయి.