ఇన్వెస్ట్ గ్లోబల్ సమ్మిట్ పకడ్బందీ ఏర్పాట్లు
సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సమావేశానికి హాజరైన మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026ను ప్రతిష్ఠాత్మకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.
సమ్మిట్ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో ప్రతి అంశా న్ని పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ప్రజా ప్రభుత్వం నిర్వహించే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సోమవారం ప్రజాభవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి సబ్ కమిటీ సభ్యులు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ సమ్మిట్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించి, అవసరమైన నిర్ణయాలు వేగంగా తీసుకునేలా ప్రజాభవన్‌లో ప్రత్యేకంగా వార్‌రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. సమ్మిట్ నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్ల కమిటీలను ఏర్పాటు చేసి, ప్రతి కమిటీకి సీనియర్ అధికారులను బాధ్యులుగా నియమించాలని ఆదేశించారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ప్రత్యేకమైన లోగోను రూపొందించాలని ఆదేశించారు.
సమ్మిట్‌లో పాల్గొనే ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సమర్థవంతంగా వివరించేలా కార్యక్రమ రూపకల్పన ఉండాలని సూచించారు. సమ్మిట్‌కు విస్తృత అంతర్జాతీయ, జాతీయ ప్రచారం కల్పించడంలో భాగంగా అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో దేశ రాజధాని ఢిల్లీలో కర్టెన్ రైజర్ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని భట్టి విక్రమార్క సూచించారు.
విదేశీ దౌత్యవేత్తలు, కేంద్ర మంత్రులు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న తెలంగాణ అధికారులు, ఇతర ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ప్రింట్, ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తూ రోజువారీ పురోగతి నివేదికను రూపొందించి తనకు అందజేయాలని ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్‌ను ఆదేశించారు.
తెలంగాణను పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థా నంగా ప్రపంచానికి పరిచయం చేసేలా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ెే2026ను నిర్వహించాలని, ఇందుకోసం ప్రభుత్వంలోని అన్ని శాఖలు ఒకే లక్ష్యంతో సమన్వయంతో పనిచేయాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సమావేశంలో ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, ఫ్యూచర్ సిటీ సీఎండీ శశాంక, ట్రాన్స్‌కో సీఎం డీ కృష్ణ భాస్కర్, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ తదితరులు ఉన్నారు.






