15 April, 2026 | 3:16 AM

లోక్‌సభ స్థానాలు 850?

15-04-2026 12:38 AM
  1. డీలిమిటేషన్ ప్రక్రియకు కేంద్రం అడుగులు
  2. రాష్ట్రాల్లో 815 స్థానాలు, యూటీల్లో 35 స్థానాలకు చేరిక?
  3. 543 స్థానం నుంచి అమాంతం పెరుగుదల
  4. మహిళా రిజర్వేషన్ల అమలుకు కూడా.. 
  5. ౧౬న పార్లమెంట్‌లోకి బిల్లులు.. మూడు రోజుల పాటు చర్చ
  6. బిల్లులపై విపక్షాల తీవ్ర అభ్యంతరం.. ఏకపక్ష నిర్ణయాలంటూ మండిపాటు

న్యూఢిల్లీ, ఏప్రిల్ ౧౪: మహిళా రిజర్వేషన్ల అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది. అలాగే, లోక్‌సభ స్థానాల సంఖ్యను డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ద్వారా ప్రస్తుతం ఉన్న 543 నుంచి 850కి పెంచాలని ప్రతిపాదించింది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లు ముసాయిదాను తాజాగా పార్లమెంట్ సభ్యులందరికీ చేరవేసింది.

బిల్లు అమలులోకి వస్తే దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఊపందుకోనున్నది. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి మహిళా కోటాను అమలు చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులు చేస్తున్నది. కొత్త ప్రతిపాదన ప్రకారం.. లోక్‌సభ స్థానాల సంఖ్య రాష్ట్రాల్లో 815, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 స్థానాలకు చేరుకోనుంది. మహిళా కోటా బిల్లు అమలు కోసమే కేంద్రం లోక్‌సభ స్థానాల పెంపునకు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఈ బిల్లులను కేంద్రం 16న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది.

ఆ రోజు నుంచి 18 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బిలులలపై చర్చ జరగనుంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం భావిస్తున్నది. గతంలో 2023లో ఆమోదించిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ అమలుకు జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి.

సాధారణంగా కొత్త జనాభా లెక్కల తర్వాతే ఈ ప్రక్రియ జరగాలి. అయితే, 2029 లోపే రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఉద్దేశంతో కేంద్రం పాత గణాంకాలనే ప్రామాణికంగా తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. మహిళలకు 33 శాతం కోటా ఇచ్చేందుకు ఈ స్థానాల పెంపు ఎంతో దోహదపడుతుందని ప్రభుత్వం చెబుతున్నది.

విపక్షాల తీవ్ర అభ్యంతరాలు

డీలిమిటేషన్‌పై కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. డీలిమిటేషన్‌కు 2011 జనాభా లెక్కలను వాడటం సరికాదని ఏఏపీ, ఆర్జేడీ, డీఎంకే వంటి పార్టీలు మండిపడుతున్నాయి. 2021 జనాభా గణన వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

ప్రక్రియ అమలులోకి వస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందని గగ్గోలు పెడుతున్నాయి. అలాగే, ఓబీసీ మహిళలకూ మహిళల రిజర్వేషన్లలో ఉప కోటా ఇవ్వాలన్న డిమాండ్‌ను కూడా లేవనెత్తనున్నాయి. బెంగాల్, తమిళనాడు ఎన్నికలను క్యాష్ చేకునేందుకు బిల్లులు తెరమీదకు తెచ్చారని విమర్శిస్తున్నాయి.

ముగ్గురు సభ్యులతో కమిషన్ 

లోక్‌సభ స్థానాల సంఖ్యను 850కి పెంచే ప్రక్రియ పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటును ప్రతిపాదించింది. కమిషన్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రస్తుత లేదా విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు. కమిషన్‌లో ఇతర సభ్యులుగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ లేదా ఆయన నామినేట్ చేసిన ఎన్నికల కమిషనర్ ఉంటారు. వీరితో పాటు సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా వ్యవహరిస్తారు. డీలిమిటేషన్ బిల్లు 2026 ముసాయిదా ప్రకారం ఈ కమిషన్ నియోజకవర్గాల పునర్విభజన బాధ్యతలను స్వీకరిస్తుంది.

ఏకపక్షంగా డీలిమిటేషన్: స్టాలిన్

కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టనుందని తమిళనాడు సీఎం స్టాలిన్ మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం అశాస్త్రీయంగా నియోజకవర్గాలను పునర్విభజించనున్నదని ఆరోపించారు. డీలిమిటేషన్‌తో ప్రభావితమయ్యే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే తాము చెన్నైలో సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశాన్ని నిర్వహించామని గుర్తుచేశారు.

దక్షిణాది రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం ఉండదని ప్రధాని మోదీ పార్లమెంటులో హామీ ఇవ్వాలని డిమాండ్ చేశామని, ఇంతవరకు దీనిపై స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రధానితో అపాయింట్‌మెంట్ కోరామని, కనీసం అపాయింట్‌మెంట్ అయినా మోదీ ఇవ్వలేదని వాపోయారు. డీలిమిటేషన్ అమలు చేస్తే తమిళనాడు ప్రేక్షకపాత్ర పోషించదని, రాష్ర్టంలోని ప్రతి కుటుంబం వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

నేడు అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: న్యూఢిల్లీలోని ఇందిరాభవన్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన బుధవారం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై అఖిలపక్ష సమావేశం జరుగనుంది. ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరుగనున్న ఈ సమావేశానికి విపక్ష పార్టీకి చెందిన ముఖ్యనేతలు, ఎంపీలు హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బిల్లులపై భేటీలో చర్చించనున్నారు.

అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించకుండానే కేంద్రం ఏకపక్షంగా ముందుకు వెళ్లడంపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సమావేశంలో విపక్షాలన్నీ కలిసి ఒక ఉమ్మడి నిర్ణయానికి రానున్నాయి. ఇదే వేదిక ద్వారా తమ భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నాయి.