18 April, 2026 | 7:54 PM

చెట్టుకు రాఖీ కట్టిన బీహార్ సీఎం

20-08-2024 03:07 AM

పర్యావరణ పరిరక్షణపై అవగాహన కోసమేనని వెల్లడి

బీహార్ (పాట్నా), ఆగస్టు 19: పవిత్ర రాఖీపౌర్ణమి రోజున బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఓ చెట్టుకు రాఖీ కట్టారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే ఇలాంటి కార్యక్రమం చేపట్టినట్లు సీఎం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులతో కలిసి రాష్ట్ర రాజధాని పట్నాలోని వాటికలో మెక్కలు నాటారు. ‘అన్నాచెళ్లెల్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేళ.. రాఖీ కట్టిన చెళ్ల్లెల్లు, అక్కలు, ఆడవారికి అండగా ఉంటామని ఎలాగైతే మనం భరోసా ఇస్తామో.. చెట్లకు కూడా అలాగే భరోసా ఇవ్వాలి’ అని నితీశ్ కుమార్ కోరారు. 

బీహార్ వృక్ష దివస్‌గా..

పచ్చదనం, పర్యావరణాన్ని కాపాడేందుకు గాను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం 2012 నుంచి రక్షా బంధన్‌ను బీహార్ వృక్ష దివస్‌గా పాటిస్తోంది. ‘జల్ జీవన్ హరియాలి’ మిషన్‌లో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా నాటిన మొక్కలను కాపాడే బాధ్యత పౌరులదే అని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ఎక్కడనుంచి వచ్చిందీ సంప్రదాయం?

జీవకోటి ఆరోగ్యాన్ని సంరక్షించే పచ్చని చెట్లను సురక్షితంగా ఉంచడమే లక్ష్యంగా ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో స్థానిక ప్రజలు 2004 ఏడాది నుంచి ప్రతీ రాఖీ పండుగ రోజున చెట్లకు రాఖీ కట్టడం ప్రారంభించారు. దీన్ని అక్కడ ‘జంగిల్ బంధన్’ అని పిలుస్తారు. రాఖీ పౌర్ణమి రోజున దగ్గరలోని అటవీ ప్రాంతంలో, ఇళ్లలోని చెట్లకు అక్కడి ప్రజలు రక్ష(రాఖీ) కడుతుంటారు. మొక్కలను నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రతీ ఏటా ఈ సాంప్రదాయాన్ని అక్కడి ప్రజలు కొనసాగిస్తున్నారు.