calender_icon.png 17 January, 2026 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి సంక్షేమంపై బీజేపీ, బీఆర్ఎస్ చర్చకు సిద్ధమా?

17-01-2026 08:35:40 PM

- సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్,(విజయక్రాంతి):  కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో బిజేపీ, బీఆర్ఎస్ లు చేసిన అభివృద్ధి తక్కువ.. ప్రచార ఆర్భాటం, ప్రజా ధనం దుర్వినియోగం ఎక్కువ అని, ఆ రెండు పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని సుడా ఛైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. కరీంనగర్ లో బిజేపీ, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని  సవాల్ విసిరారు. శనివారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ ప్రజా కోర్టులో కరీంనగర్ కు ఎవరేం చేశారో చర్చించే దమ్ముందా అని ప్రశ్నించారు.  కేంద్ర సహాయ మంత్రి  బండి సంజయ్, మాజీ మంత్రి, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లు కరీంనగర్ కు పదేళ్లలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కు సోషల్ మీడియాలో పబ్లిసిటీ, మీడియాలో బ్రేకింగుల కోసం సంచలన వ్యాఖ్యలు తప్ప ఏమీ చేతకావడం లేదని అన్నారు. కరీంనగర్ లో ఎంపీగా రెండు సార్లు గెలిచి కేంద్రమంత్రి గా ఉండి ఏం చేశారో చెప్పాలని అన్నారు. కేంద్రంలో బిజేపీ అధికారంలో ఉందని, అదనంగా కరీంనగర్ కు తెచ్చింది, ఇచ్చింది ఏంటో చెప్పాలని అన్నారు. మోదీ మెచ్చుకున్నంత మాత్రాన కరీంనగర్ కు ఏం తెచ్చారని ప్రశ్నించారు. కేంద్రం నుంచి ఒక్క ప్రాజెక్టు, యువత కోసం ఉపాధి కల్పించే విషయంలో బండి సంజయ్ విఫలం అయ్యారని అన్నారు.

కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులన్నీ నాసీరకంగా, పద్దతి, ప్లాన్ లేకుండా చేశారని, ఐదు లక్షల జనాభాకు సరిపడా రోడ్లే లేవని, పెద్దరోడ్లను కుదించారని అన్నారు. పదేళ్లలో బిజేపీ, బీఆర్ఎస్ లు ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేయలేదని అన్నారు. కరీంనగర్ సుందరీకరణ పేరుతో ఉన్నదానికంటే పెంచి జంక్షన్లకు కోట్ల రూపాలు ఖర్చు పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేశారని అన్నారు. మున్సిపల్ లో 20 కోట్ల సాధారణ నిధులు, సుడా ద్వారా 20 కోట్లతో అంతర్గత రోడ్లు డ్రైనేజీలు నిర్మించామని తెలిపారు.

డ్రైనేజీలకు, రోడ్ల పునరుద్ధరణకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే.. కాంగ్రెస్ ఏమీ చేయలేదని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. పదేళ్లలో కరీంనగర్ లో ఒక్క వర్షానికే రోడ్లు మునిగాయని, ప్రధాన రహదారులన్నీ బ్లాక్ అయ్యాయని అన్నారు. వర్షం నీళ్లు నిలిచే డేంజర్ స్పాట్ల దగ్గర పది కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఆర్టీసీ వర్క్ షాప్, టూటౌన్ పోలీస్ స్టేషన్, రాంనగర్ బస్ స్టాప్ వద్ద నీళ్లు నిలవకుండా కల్వర్టుల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.   బీఆర్ఎస్ హయాంలో చేసిన అవినీతికి అడ్డుకట్ట వేశామని, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం లేదని అన్నారు.

బ్యూటిఫికేషన్ లో కరీంనగర్ నంబర్ వన్ ఉండేలా చేస్తామన్నారు. కొత్తగా ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇలా కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తుంటే.. రూపాయి కూడా పెట్టలేదంటారా? మీలాగా పబ్లిసిటీ పిచ్చిలో మేం పడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం.. ప్రజలకు జవాబు దారితనంగా ఉంటామన్నారు. బీఆర్ఎస్ కథ ముగిసిందని, మాటలతో నడిపించే బీజేపీ కథ కూడా ముగుస్తుందని అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని తెలిపారు.

కార్పోరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ  గత రెండేళ్లుగా ప్రభుత్వం అమలు పరస్తున్న రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు లాంటి సంక్షేమ పథకాలను పొందుతున్న లబ్ధి దారుల వద్దకు వెళ్లి మద్దతు కోరుతామని, రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి ఓటు అడుగుతామని అన్నారు.ఈ విలేకరుల సమావేశంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, ఎండి తాజ్, పిట్టల రవీందర్, కుర్ర పోచయ్య, మాసూమ్ ఖాన్, కిరణ్ రెడ్డి, ముల్కల యోన, బషీర్, భారీ, ఖలీల్, సుదర్శన్, తోట అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.