మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రతిపక్షాల తీరును ఖండించిన బీజేపీ
కోనరావుపేట,(విజయక్రాంతి): మహిళా రిజర్వేషన్ బిల్లు సహా కీలక రాజ్యాంగ సవరణ బిల్లులను వ్యతిరేకించడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు మహిళలకు అన్యాయం చేశాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చెన్నమనేని వికాస్ బాబు విమర్శించారు. పత్రికా సమావేశంలో మాట్లాడుతూ... పార్లమెంటులో చర్చకు వచ్చిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, డిలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణలు మహిళా సాధికారతకు చారిత్రాత్మక అవకాశమని అన్నారు.
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ, డీఎంకే పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకించడం ద్వారా మహిళల ఆశయాలను దెబ్బతీశాయని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించాలనే లక్ష్యంతో ఈ బిల్లులను తీసుకువచ్చారని తెలిపారు. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం ఉండదని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.మహిళా సాధికారతకు బీజేపీ కట్టుబడి ఉందని, మహిళల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.






