21 April, 2026 | 7:57 PM

Breaking News

కష్టపడి పనిచేస్తే ఏ లక్ష్యమైనా సాధ్యం

21-04-2026 06:35 PM
  • జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
    • పోటీ పరీక్షలపై దృష్టి సారించాలి
    • విజయం తర్వాత ఆగకుండా ఇంకా ఉన్నత లక్ష్యాలు సాధించాలి
    • విద్యార్థులు పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి
    • ఇంటర్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులకు ఘనంగా సన్మానించిన జిల్లా కలెక్టర్

  • ఖమ్మం,(విజయక్రాంతి): ఇంటర్ పరీక్షలలో మంచి ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థినీ, విద్యార్థు లను అభినందిస్తూ, వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని, కష్టపడి పని చేస్తే ఎంతటి విజయమైనా సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఇంటర్ పరీక్షలలో మంచి ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ తన చిన్నతనంలో తనకు ప్రత్యేకమైన కలలు లేదా ఆత్మవిశ్వాసం లేవని, అయితే ఇంటర్ ఫలితాలు తనలో నమ్మకాన్ని పెంచాయని తెలిపారు.

కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించగలమనే విశ్వాసం అప్పుడు కలిగిందని చెప్పారు. ప్రస్తుతం మంచి మార్కులు సాధించిన ప్రతి విద్యార్థిలో ప్రతిభ, మేధస్సు ఉన్నాయని, వాటిని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థులు ఇప్పటితోనే ఆగకుండా ఇంకా ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని, మంచి కళాశాలలో సీటు పొందేందుకు పోటీ పరీక్షలపై దృష్టి సారించాలని తెలిపారు. మంచి విద్యా సంస్థల్లో చదవడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు, జీవన శైలీలు తెలుసుకునే అవకాశం ఉంటుందని, ఎప్పుడూ తక్కువగా భావించకూడదని సూచించారు. కష్టపడి పనిచేస్తూ, మనపై మనం నమ్మకం ఉంచితే ఏ లక్ష్యమైనా సాధ్యమని పేర్కొన్నారు.

విజయం సాధించిన వారిలో మేధస్సు, మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కష్టపడే స్వభావమనే మూడు ముఖ్య లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ఒకసారి విజయం సాధించిన తరువాత అక్కడే ఆగిపోకుండా ఇంకా ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రయత్నించాలన్నారు. విద్యార్థులు ఎల్లప్పుడూ మంచి పరిజ్ఞానాన్ని సాధించే దిశగా కృషి చేస్తే విజయం సహజంగా వస్తుందని, వైఫల్యాలు మనల్ని ఆపకూడదని చెప్పారు. జీవితం అనేది సవాళ్లతో నిండినదని, వాటిని ఎలా అధిగమిస్తామన్నదే ముఖ్యమని పేర్కొన్నారు. కష్టాల ద్వారా వచ్చిన ఫలితాలు మరింత విలువైనవని తెలిపారు. జీవితంలో అవకాశాలు ఎప్పుడూ ఉంటాయని, ఒక అవకాశం కోల్పోయినా మరో అవకాశం వస్తుందని, విద్యార్థులు తమ లక్ష్యాల సాధనలో పట్టుదలగా ఉండాలని సూచించారు.

అడ్డంకులు, వైఫల్యాలను పాఠాలుగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల విద్యను నేర్చుకోవడం సులభమైందని, సోషల్ మీడియా, రీల్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఇంటర్నెట్‌ను సానుకూలంగా వినియోగిస్తూ కొత్త విషయాలను నేర్చుకోవాలని, ప్రపంచంలో జరుగుతున్న మార్పులను నిరంతరం తెలుసుకుంటూ ఉండాలని చెప్పారు. విద్యార్థులు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని, ప్రతి నెల ఒక కొత్త పుస్తకం చదివే లక్ష్యాన్ని పెట్టుకోవాలని సూచించారు. చదివిన విషయాలను రాసుకునే అలవాటు పెంచుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ విద్యార్థులను తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచాలని ప్రోత్సహించారు. ప్రతి విద్యార్థిని వారి లక్ష్యాల గురించి అడిగి తెలుసుకుని, వాటి సాధనకు అవసరమైన మార్గదర్శకత్వం అందించారు. కొంతమంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాలను చూసి కృషి చేసి మంచి ఫలితాలు సాధించామని చెప్పడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఇకపై  విద్యార్థులు పోటీ పరీక్షలపై దృష్టి సారించాలని, ఆ పరీక్షలలో మూడు గంటల సమయం ఎంతో కీలకమని, ముందుగానే సమగ్రంగా సిద్ధం కావాలని సూచించారు. మనకంటే ఎక్కువ కష్టాలు ఎదుర్కొనే వారు ఎంతో మంది ఉన్నారని గుర్తుంచుకుని ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కాలేజీల్లో నిర్వహించిన ప్రత్యేక తరగతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంలో ఎంతో సహాయ పడ్డాయని తెలిపారు. ఆ తరగతుల వల్లే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించ గలిగామని పేర్కొన్నారు. అలాగే, ఇంటర్మీడియట్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు సహకరించిన జిల్లా యంత్రాంగం, లెక్చరర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్  ప్రభుత్వ విద్యార్థినీ, విద్యార్థులను ఘనంగా సన్మానించారు.