బీజేపీ ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది

30-04-2024 02:14:05 AM

కాంగ్రెస్ వినూత్న ప్రచారం

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన అన్యాయంపై గాంధీభవన్‌లో వినూత్నంగా ‘గాడిద గుడ్డు’ పేరిట ప్రచార కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి పంగనామం పెట్టిందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ వైఫల్యాలపై ఇలాంటి హోర్డింగులను ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ రెడీ అయ్యింది. ‘తెలంగాణ అడిగినవి ఇవి.. బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు’ పేరుతో బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి, అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డి, బెల్లయ్యనాయక్ ప్రారంభించారు.

తెలంగాణ రూపాయి పంపిస్తే, కేంద్రం భిక్షం ఇచ్చినట్లు 42 పైసలు తిరిగి ఇస్తుందన్నారు. పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టుకు, మేడారం సమక్క  జాతరకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. బడ్జెట్‌లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటా అందడం లేదని కాంగ్రెస్ బ్యానర్‌లో పొందుపరిచింది. ఒక్క ఐఐఎం, ఎన్‌ఐడీ, విశ్వవిద్యాలయం ఇచ్చారా? అంటూ ప్రశ్నించింది. 811 టీఎంసీ కృష్ణా జలాల్లో సరైన వాటా ఎందుకు ఇవ్వడం లేదు?, ఐఐటీ, మెడికల్ కాలేజీ ఎందుకు ఏర్పాటు చేయట్లేదని ప్రచార కార్డులో పెట్టారు. బయ్యారం ఉక్కు ప్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, స్మార్ట్ సిటీలుగా వరంగల్, కరీంనగర్ అంటూ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని బీజేపీపై కాంగ్రెస్ విరుచుకుపడింది.