10 June, 2026 | 1:33 AM

రైతుల పాలిట ‘శని’లా బీజేపీ

10-06-2026 12:36 AM
  1. మహారాష్ట్ర సీఎంకు రాసిన లేఖలు చూడండి 
  2. ప్రభుత్వ విప్ వేముల వీరేశం

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): తెలంగాణలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని ప్రభుత్వ విప్ వేముల వీరేశం తెలిపారు. తుమ్మిడిహట్టిపైన మహారాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్ కోసం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిలు లేఖలు రాస్తే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు లేఖలు రాయలేదని చెబుతున్నాడని మండిపడ్డారు. సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిలు రాసిన లేఖలను చూపిస్తున్నామని, రాంచందర్‌రావు ఇప్పుడేమి సమాధానం చెబుతాడని వేముల వీరేశం ప్రశ్నించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు బీజేపీ శనిలా తయారైందని మండిపడ్డారు.

తెలంగాణ బీజేపీ నేతలు ప్రధాని మోదీకి చెప్పి ధాన్యం కొనుగోలు చేయిస్తారని రైతులు ఎదురు చూశారని తెలిపారు. 8 మంది బీజేపీ ఎంపీలతో రైతులకు ఎలాంటి లాభం లేదని వ్యాఖ్యానించారు. రైతుల ముందు మోదీనే మోకరిల్లిన చరిత్రను బీజేపీ నాయకులు మరిచిపోయారా అని ప్రశ్నించారు. నల్ల చట్టాలని వెనక్కి తీసుకున్న చరిత్ర మోదీది అని వ్యాఖ్యానించారు. 15వ తేదీలోపు రాష్ట్రంలో ప్రతి గింజా కొనుగోలు చేస్తామని బీజేపీ ప్రకటించాలని, లేదంటే బీజేపీ నాయకుల ఇళ్లు ధాన్యంతో నిండిపోతాయన్నారు. రైతుల కోపానికి బీజేపీ బలికాక తప్పదని హెచ్చరించారు. బీజేపీకి బీటీమ్‌గా బీఆర్‌ఎస్ పని చేస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం లేకున్నా పెద్ద ఎత్తున పంట వస్తే అసత్య రాజకీయ క్రీడకి తెరలేపారంటూ వేముల వీరేశం దుయ్యబట్టారు.