తోల్కట్టాలో నాళాల కబ్జా
ఇరిగేషన్ అధికారులు తనిఖీ చేసి తహసీల్దార్‌కు రిపోర్టు పంపినా చర్యలు తీసుకోని వైనం
చేవెళ్ల/మొయినాబాద్ జూన్ 9 (విజయ క్రాంతి): హైదరాబాద్ కు తాగునీరు అందించే ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాల పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన 111 జీవో పర్యావరణంకు రక్షణకు కవచంగా నిలిచింది. జీవో పరిధిలో భూదందాలు, నాలా కబ్జాలు, ఫామ్ల్యాండ్స్ పేరుతో కొత్త తరహా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతున్నాయి. మొయినాబాద్ మండలం టోల్కట్ట గ్రామంలో సహజ నీటి ప్రవాహ మార్గాలు, ఇరిగేషన్ నాలాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సర్వే నంబర్లు161,162,176,177 పరిధిలో ఏకంగా రెండు ఎకరాలకు పైగా నాలా భూమిని మట్టితో పూడ్చి ఫామ్ల్యాండ్స్ పేరుతో విక్రయాలకు సిద్ధం చేశారన్నరు. ఇరిగేషన్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నప్పటికీ... చర్యలు మాత్రం కనిపించడం లేదన్న గ్రామస్తులు చెబుతున్నారు.
నీటి సహజ మార్గాలను యంత్రాలతో పూడ్చి భూమిని చదును చేశారు. ప్రభుత్వ రికార్డుల్లో నాలాగా ఉన్న ప్రాంతాలను కూడా వెంచర్లో కలిపేశారని ఆరోపిస్తున్నారు. సర్వే నంబర్లు 161, 162,176, 177లోని భూమిని చదును చేస్తూ రోడ్లు, ప్లాట్లు, ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి రెవెన్యూ అధికారుల కు రిపోర్ట్ పంపించినప్పటికీ ఈ అక్రమాలు ఆగడం లేవని చెబుతున్నారు. ఫామ్ల్యాండ్స్ పేరుతో ప్లాట్లు విక్రయించి అమాయక ప్రజల మోసం చేస్తున్నారు.జిల్లా కలెక్టర్, ఇరిగేషన్, రెవెన్యూ, సంబంధిత శాఖలు సంయుక్తంగా సమగ్ర సర్వే నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ప్రకృతి సహజ నీటి వనరుల రక్షిస్తేనే భవిష్యత్తు ఉందని రేపటి పర్యావరణ విపత్తులకు కారణమవుతాయని ప్రజలు వాపోతున్నారు.






