బాసర గోదావరిలో విషాదం
నీట మునిగి ముగ్గురు అన్నదమ్ముల మృతి
ఒకరిని రక్షించబోయి మరొకరు నీట మునిగి దుర్మరణం
అమ్మవారి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో వచ్చి అనంత లోకాలకు
నిర్మల్/బైంసా, జూన్ 9 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం అమ్మవారి దర్శనం చేసుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ముగ్గురు అన్నదమ్ములు గోదావరిలో మునిగి మృతి చెందారు. హైదరాబాద్ కాచిగూడ చెప్పల్ బజార్‌కు చెందిన చంద్రశేఖర్(38), రామచందర్ (36), మల్లేష్ (31) ముగ్గురు సొంత అన్నదమ్ములు.
పిల్లలకు వేసవి సెలవులు కావడంతో బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో పూజలు చేయడానికి వచ్చారు. వెంట తల్లిదండ్రులు కూడా వచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు బాసరకు చేరుకున్నారు. బాసర గోదావరి బ్రిడ్జి వద్ద దిగిన వీరు నాలుగవ పుష్కర ఘాట్ వద్ద స్నానం చేయడానికి వెళ్లారు. ముందుగా చంద్రశేఖర్ గోదావరిలో స్నానం చేయడానికి దిగారు లోతు ఎక్కువగా ఉండటంతో చంద్రశేఖర్ మునిగిపోతున్న విషయాన్ని గుర్తించిన రెండవ సోదరుడు రామచందర్ అతని కాపాడేందుకు లోనికి వెళ్లారు.
ఈ ఇద్దరు మునిగిపోవడంతో చిన్నవాడైన మల్లేష్ కూడా నదిలోకి దిగాడు. ఆ తర్వాత భార్యలు, అమ్మానాన్నల ముందే ముగ్గురు నీటిలో గల్లంతయ్యారు. కళ్లారా చూసిన కుటుంబ సభ్యులు చేసేదేమి లేక కేకలు వేశారు. కుటుంబ సభ్యుల కేకలు విన్న జనం అక్కడికి చేరుకునే లోపే ముగ్గురు గల్లంతయ్యారు.
బాసర సీఐ దీపక్, పోలీసులు అక్కడికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. రెండు గంటలసేపు గాలించగా మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. వాటిని బయటకు తీయడంతో వారి మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదించారు. సరస్వతి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుందామని వస్తే నా కొడుకులు ముగ్గురు చనిపోయారు దేవుడా అంటూ తల్లిదండ్రులు ఏడ్చిన తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా ఎస్ పీ జానకి షర్మిల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.






