ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములను కబ్జా
పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణ పనులలో భాగంగా జరుగుతున్న కబ్జాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు(BJP MP Raghunandan Rao) సర్వే నంబర్ 428 లో 2ఎకరాల 18 గుంటల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. జాతీయ రహదారుల విస్తరణ కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. కబ్జాదారులకు, విస్తరణ అభివృద్ధి పనులకు సంబంధం లేదని వెల్లడించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎవరికి వారు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ఆరోపించారు.
ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదులను రాత్రికి రాత్రి కూలగొట్టడం బాధాకరమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాల్ బయటనే జాతీయ రహదారి విస్తరణ చేయాల్సి ఉండగా భౌండరీ దాటి పాఠశాల తరగతి గదులను కూల్చివేయటంలో ఆంతర్యమేమిటి? అని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు ఈ విషయమై స్పందించి పాఠశాల తరగతి గదులను కూల్చిన మిషనరీని, కాంట్రాక్టర్లను, కూల్చీవేతలలో నిమగ్నమైన వారిపై చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. పాఠశాల కూల్చివేతలపై అధికారులు సీరియస్ గా చర్యలు తీసుకోవాలిని, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరారు.




