అంబేడ్కర్‌కు కాంగ్రెస్ తీరని ద్రోహం
* పచ్చగడ్డిలో పసిరిక పాము లాంటిది కాంగ్రెస్
* అంబేడ్కర్ ఆశయాలకు నిజమైన వారసులం మేమే.
* మోదీ పాలనలోనే దళితులకు వాస్తవిక సాధికారత
* బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొప్పు కాంతికిరణ్
* ఖమ్మంలో ఘనంగా బీజేపీ ఎస్సీ మోర్చా మేధావుల సదస్సు
ఖమ్మం,(విజయక్రాంతి): సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు భారతీయ జనతా పార్టీ అహర్నిశలు కృషి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కొప్పు కాంతి కిరణ్ ఉద్ఘాటించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 136 జయంతి వేడుకలను పురస్కరించుకుని ఏప్రిల్ 11 నుంచి 20 వరకు పార్టీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న జయంతి వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఖమ్మం నగరంలోని ఐఎంఏ హాల్ లో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో 'మేధావుల సదస్సు' ఘనంగా జరిగింది.
జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ మహా సభకు డాక్టర్ కొప్పు కాంతి కిరణ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సకల జనుల సంక్షేమం కోసం అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయడంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వతంత్ర భారతానికి ఒక విశిష్టమైన రాజ్యాంగం అవసరమైనప్పుడు విదేశాల నుంచి మేధావులను తీసుకురావాలని నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ భావించారని, అయితే మహాత్మా గాంధీ సూచనతో ఆ బాధ్యతను అంబేడ్కర్‌కు అప్పగించారని గుర్తుచేశారు.
ఎన్నో దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, దేశంలోని అన్ని వర్గాలకు, మతాలకు, కులాలకు సమాన హక్కులు కల్పిస్తూ అద్భుతమైన రాజ్యాంగాన్ని ఆయన దేశానికి అందించారని కొనియాడారు. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్‌ను తీవ్రంగా అవమానించిందని, పార్లమెంట్ తలుపులు మూసివేసి ఆయనను చట్టసభల్లో అడుగుపెట్టకుండా అడ్డుకోవడంతో పాటు ఎన్నికల్లో కుట్రపూరితంగా ఓడించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దళితుల పాలిట పచ్చగడ్డిలో పసిరిక పాము లాంటిదని ఆయన అభివర్ణించారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పార్టీ కేవలం తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకుందని, చరిత్రలో ఆయనకు దక్కాల్సిన ప్రాధాన్యతను దక్కకుండా చేసిందని విమర్శించారు.
ఈ సందర్భంగా ఇతర వక్తలు సదస్సును కొనసాగిస్తూ.. అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని, ఆయన ఎదుర్కొన్న వివక్షను సభికులకు సోదాహరణంగా వివరించారు. సమాజంలో మహిళలకు సమాన హక్కులు కల్పించే ఉద్దేశ్యంతో అంబేడ్కర్ ప్రతిపాదించిన హిందూ కోడ్ బిల్లుకు నాటి కాంగ్రెస్ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైందని, దానికి మనస్తాపం చెందే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారని నాయకులు గుర్తుచేశారు. ఒక వర్గానికే పరిమితం చేయాలని చూసిన కుట్రలను ఛేదిస్తూ, యావత్ భారతదేశానికీ, అన్ని వర్గాల ప్రజలకు ఆయన చేసిన సేవలను నాయకులు కొనియాడారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రమే అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా నిజమైన పాలన అందిస్తోందని నేతలు స్పష్టం చేశారు. రెండు వేల పద్నాలుగులో మోదీ ప్రధాని అయిన నాటి నుంచి దళిత, బడుగు బలహీన వర్గాల ఆర్థిక, సామాజిక సాధికారత కోసం ఎన్నో అద్భుతమైన పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని కొనియాడారు. అంబేడ్కర్ జీవిత చరిత్రకు సంబంధించిన పంచ తీర్థాలను అభివృద్ధి చేయడంతో పాటు, ఎంతో మంది మరుగున పడిన దళిత, బహుజన వీరుల చరిత్రను దేశానికి పరిచయం చేసిన ఘనత కేవలం భారతీయ జనతా పార్టీకే దక్కుతుందని ప్రశంసించారు. దళితుల అభ్యున్నతి కోసం నిస్వార్థంగా పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అని ఉద్ఘాటించారు.
ఈ అద్భుతమైన సదస్సులో భాగంగా సమాజ నిర్మాణంలో విశేష కృషి చేస్తున్న పలువురిని నాయకులు ఘనంగా సత్కరించారు. అత్యున్నత విద్యను అభ్యసిస్తున్న ఎస్సీ వర్గానికి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను, మేధావులను వేదికపై ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సదస్సులో రాష్ట్ర నాయకులు, శ్రీరక్ష హాస్పిటల్ అధినేత డాక్టర్ గోంగూర వెంకటేశ్వరరావు, రుద్ర ప్రదీప్, కోటమర్తి సుదర్శన్, మండడపు సుబ్బారావు, మేకల నాగేందర్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు, నాయకులు బోయిన వెంకట్, వీరవెల్లి రాజేష్, ఆర్ వి ఎస్ యాదవ్, శ్రీకృష్ణ, జైదీప్, స్వర్ణకార్, ప్రభాకర్, ఫమ్మి అనిత, మంద సరస్వతి, నక్క రవిగౌడ్, రీగన్ ప్రతాప్,తదితర ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






