కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ పోరుబాట
- రేపు మండల కేంద్రాల్లో, 20న జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు
- త్వరలో తదుపరి కార్యాచరణ
- కాంగ్రెస్ ప్రభుత్వానికి మిగిలింది 999 రోజులే..
- ‘ఇగ సహించదు తెలంగాణ’ పోస్టర్ ఆవిష్కరణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ పేరుతో 99 రోజుల కార్యాచరణను ప్రకటించిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా 999 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య, ప్రజావ్యతిరేక, వైఫల్య పాలనకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యం లో పోరుబాట ప్రారంభిస్తున్నామని ప్రకటించారు.
మార్చి 16న మండల కేంద్రాల్లో, 20న జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్నట్లు రాంచందర్‌రావు వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన ‘ఇగ సహి ంచదు తెలంగాణ-సేవ్ తెలంగాణ’ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిపాలనా వైఫల్యాలపై మరింత గట్టిగా తాము పోరాడుతామని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణం గా బీజేపీ నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు. ఈనెల 16న కార్యకర్తలు మండల ఎంఆర్‌వోలకు వినతిపత్రాలు సమర్పిస్తారని, అదేవిధంగా మార్చి 20న జిల్లా కేంద్రాల్లో అన్ని కలెక్టరేట్ల ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇతర కార్యక్రమాలను త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలేదని, రైతు భరోసా అందడం లేదని, పేద ప్రజలకు ఇళ్లు ఇవ్వడం లేదని, వృద్ధులకు పెన్షన్లు సకాలంలో అందించకపోవడంతో పాటు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ల పెంపు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. ఈ వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసేలా ఈ పోస్టర్‌ను రూపకల్పన చేసినట్లు రాంచందర్‌రావు తెలిపారు.
తెలంగాణ ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని, ప్రజల పక్షాన పోరాడి వారి హక్కులను కాపాడేందుకు బీజేపీ కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్‌వి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.




