సింగూర్ సెగ్మెంట్‌లో తాగునీటి వనరులపై సమగ్ర సర్వే
– రీఛార్జ్ పిట్ల ఏర్పాటుకు ప్రత్యేక కమిటీ: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి,(విజయక్రాంతి): సింగూర్ రిజర్వాయర్ నీటి లభ్యతను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు భూగర్భ జలాలను పరిరక్షించే దిశగా సింగూర్ సెగ్మెంట్ పరిధిలోని జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పరిధిలో ఉన్న 14 మండలాల గ్రామాల్లో తాగునీటి వనరులపై సమగ్ర సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు శనివారం జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి చందర్ నాయక్, జిల్లా పంచాయతీ అధికారి మురళిజిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దామోదర్ రెడ్డి, జిల్లా భూగర్భ జలాల శాఖ ఉప సంచాలకులు, మిషన్ భగీరథ కార్యనిర్వాహక అభియంత రమేష్ తో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ గ్రామాల వారీగా చేతి పంపులు, బోర్‌వెల్లు, సింగిల్ ఫేజ్ మోటార్లు, గ్రామీణ తాగునీటి పథకాల సోర్స్‌లను క్లుప్తంగా సర్వే చేసి, నీటి వనరుల పరిస్థితిని అంచనా వేస్తుంది. సర్వే నివేదిక ఆధారంగా అవసరమైన ప్రాంతాల్లో రీఛార్జ్ పిట్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించి, భూగర్భ జలాల పునరుద్ధరణతో పాటు తాగునీటి వనరుల స్థిరీకరణకు చర్యలు చేపట్టనున్నారు.ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు, వర్షపు నీటిని భూగర్భ జలాల్లోకి ఇంకేలా శాశ్వత పరిష్కారాలను అమలు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.






