22 March, 2026 | 4:36 AM

రేపు బీజేపీ అసెంబ్లీ ముట్టడి

22-03-2026 12:06 AM

ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యాలకు నిరసనగా బీజేపీ పిలుపు

ఎమ్మెల్సీ మల్క కొమురయ్య

హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్ రావు పిలుపు మేరకు ఈనెల 23న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్‌తో కలిసి ఆయన మాట్లాడారు.

విద్యారంగానికి బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు సరిగా అమలు కావడంలేదన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించడంలేదని, ఏ శాఖలో చూసినా సమస్యలే కనిపిస్తున్నాయన్నారు. పేదల ఇండ్ల నిర్మాణం నుంచి రైతుల సమస్యల వరకూ ప్రతి రంగంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలను తమవిగా ప్రచారం చేసుకుంటుందని, కానీ మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వలేక అనేక పథకాలు నిలిచిపోతు న్నాయని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 14 శాతం నుంచి 18 శాతం వరకు విద్యకు కేటాయింపులున్నాయని, తెలంగాణలో మాత్రం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు.

బడ్జెట్‌లో కేటాయింపులు, రెవెన్యూ అంచనాలు, వాస్తవ ఖర్చుల మధ్య స్పష్టత లేకుండా బడ్జెట్ గందరగోళంగా ఉందన్నారు. వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు అన్ని వర్గాల ప్రజలు 23న చేపట్టే అసెంబ్లీ ముట్టడిలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.