అక్రమ ఇసుక స్థావరాలపై దాడి
3 టాక్టర్లు, జేసీబీ స్వాధీనం
తూప్రాన్, మార్చి 21: అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు తూప్రాన్ ఎస్సై గంగరాజు తన సిబ్బందితో కలిసి శనివారం మెరుపు దాడి చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధి గౌడిగూడెం సమీపంలో హల్దీ వాగు పరివాహక ప్రాంతంలో, కిష్టాపూర్ హల్దీవాగు సమీపంలో కొందరు అక్రమార్కులు రాత్రుల్లో జెసిబిల సహాయంతో ఇసుకను తరలిస్తున్నారని సమాచారం రావడంతో శనివారం ఉదయం ఇసుక ఫిల్టర్ల వద్ద మెరుపు దాడి నిర్వహించారు.
ఒక జెసిబి, మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు డంపింగ్ చేసిన ఇసుకను సీజ్ చేశారు. కాగా గౌడిగూడెం గ్రామస్తుడు ఒకరు కిష్టాపూర్ గ్రామస్తులు కొందరు కలిసి హల్దీ వాగు సమీపంలో పంట పొలాల ప్రక్క నుండి ఇసుక ను తవ్వి నీటి పైపులతో ఫిల్టర్ చేసి వాటిని అధిక మొత్తంలో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.




