6 May, 2026 | 3:39 AM

ఓటు చోరీతో బెంగాల్‌లో బీజేపీ విజయం

06-05-2026 02:15 AM
  1. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 
  2. మోదీ రాష్ట్రానికి వచ్చేకంటే ముందే కాళేశ్వరంపై సీబీఐ విచారణ ప్రారంభించాలి 
  3. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ 

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): బెంగాల్‌లో బీజేపీకి అనుకూల పరిస్థితులు లేకున్నా అక్కడ ఓటు చోరీతోనే బీజేపీ గెలిచిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. ఆ రాష్ట్రంలో దాదాపు 90 లక్షలకుపైగా ఓట్లను తొలగించిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని ఓటును కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి 10న వస్తున్నారని, ఆయన వచ్చేలోపు కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేపడుతారా? అని ప్రశ్నించారు. మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.

మమతా బెనర్జీ, కేజ్రీవాల్ మీద కేసులు పెట్టిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణకు వచ్చేసరికి కేసీఆర్‌పై ఎందుకు కేసులు పెట్టలేదని నిలదీశారు. బీఆర్‌ఎస్‌లో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని రాష్ట్ర ప్రభు త్వం విజ్ఞప్తి చేసినా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయ డం లేదో కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు.

బీఆర్‌ఎస్ నేతల మద్దతు లేకుండా బీజేపీకి రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు వచ్చేవా? అని ప్రశ్నించారు. హరీష్‌రావు మద్దతు లేకుండానే మెదక్‌లో బీజేపీ ఎంపీ గెలిచారా? అని ప్రశ్నించారు. వరి వేస్తే ఉరే అన్న బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు రైతుల కోసం ఏదో చేస్తున్నట్లుగా మొసలీ కన్నీరు కారుస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, బోనస్‌తో పాటు మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. మక్కలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు.