మున్సిపల్ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే రాగమయి సమీక్ష
సత్తుపల్లి, మే 5 (విజయక్రాంతి): సత్తుపల్లి నియోజకవర్గంలో మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పర్యటించారు. పట్టణంలోని ద్వారకా పూరి కాలనీలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, 17 మంది కౌన్సిలర్లు, 6 వార్డుల ఇంచార్జ్లతో ముఖ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ, సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 23 వార్డుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల్లో ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు రూ.25 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు.
ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తరువాత సత్తుపల్లి పట్టణంలోని కిరాణా మర్చంట్ ఫంక్షన్ హాల్లో జరిగిన కొవ్వూరి రామారావు, నాగమణి దంపతుల కుమార్తె ఆకాంక్ష వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఎమ్మెల్యే ఆశీర్వదించారు. మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత, ఏఎంసి చైర్మన్ దోమ ఆనంద్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాదె చెన్నారావు, మున్సిపల్ కౌన్సిలర్లు వార్డు ఇంచార్జ్లు పాల్గొన్నారు.






