కమలం అఖండ విజయం
ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో ఎంపీ అభ్యర్థి నగేష్ గెలుపు
సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకున్న కమలం పార్టీ
రెండోస్థానంలో నిలిచిన కాంగ్రెస్
పూర్తిగా చతికల పడిన బీఆర్‌ఎస్
అదిలాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకున్నది. ఆ పార్టీ అభ్యర్థి గోడం నగేష్ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానానికి పరిమితం కాగా బీఆర్‌ఎస్ పూర్తిగా చతికల పడింది. బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ 90,652 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణపై విజయం సాధించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముధోల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్ అసెంబ్లీ స్థానాలు ఉండగా, వీటి పరిధిలో 12,21,763 ఓట్లు పోలయ్యాయి.
బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ 5,67403 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ 4,77,516 ఓట్లు, బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు 1,37,300 ఓట్లు రాబట్టారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్ 23 వరకు బీజేపీ అధిక్యంలో కొనసాగుతూ వచ్చింది. పోస్టల్ బ్యాలెట్లలో సైతం బీజేపీ ఆధిక్యాన్ని చూపింది. తొలి రౌండ్ నుంచీ బీజేపీ, కాంగ్రెస్ ఆభ్యర్థుల మధ్యనే పోటీ కనిపించింది.
రాజకీయ ప్రవేశం..
తండ్రి రామారావు ఎన్టీఆర్ ప్రభుతంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి గా పనిచేశారు. ఆయన రాజకీయ వారసుడిగా నగేష్ 1994లో ప్రభుత ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశారు. బోథ్ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి ఎన్నికల్లో గెలిచారు. అతి పిన్న వయస్కుడిగా శాసనసభలో అడుగుపెట్టారు. ఎన్టీఆర్ క్యాబినేట్‌లో రాష్ట్ర గిరిజన సంక్షేమ, దివ్యాంగులశాఖ మంత్రిగా పనిచేశారు. తిరిగి 1999 ఎన్నికల్లో మరోసారి టీడీపీ తరఫున ఎమ్మెల్యే బరిలో నిలిచి విజయం సాధించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.
2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు టీడీపీకి రాజీనామా చేసి 2014లో టీఆర్‌ఎస్‌లో చేరారు. లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2019 లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు చేతిలో ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి బోథ్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. 2024లో బీజేపీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగారు.






