17 July, 2026 | 7:15 AM

లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ ‘హస్త’గతం

05-06-2024 02:07 AM

నాగర్‌కర్నూల్, జూన్ 4 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లు రవి 94,414 ఓట్ల మెజార్టీతో తన సమీప బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్‌ప్రసాద్‌పై గెలుపొందారు. మల్లు రవి 4,65,072, భరత్‌ప్రసాద్ 3,70,658, బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ 3,21,343 ఓట్లు సాధించారు.

రాజకీయ నేపథ్యం..

1980, 1989లో తండ్రి మల్లు అనంతరాములు నాగర్‌కర్నూల్ ఎంపీగా రెండుసార్లు గెలిచారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మల్లు రవి 1980 మధ్యకాలంలో నాటి కాంగ్రెస్ పార్టీ డాక్టర్ల సంఘ విభాగంలో సభ్యుడిగా చేరారు. తర్వాత కన్వీనర్‌గా ఎదిగారు. 1991, 1998లో నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999లో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన నేపథ్యంలో మల్లు రవి ఆ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో మహాకూటమి అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూశారు. 2014లో కాం గ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. 

కాంగ్రెస్ పార్టీ సంబురాలు..

మల్లు రవి విజయం ఖాయం కావడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు నిర్వహించాయి. సంబురాల్లో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంతి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, మేఘారెడ్డి, రాజేష్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. తొలుత పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం స్వీట్లు పంచుతూ, పటాకులు కాలుస్తూ సందడి చేశారు.