మెదక్‌లో ఎగిరిన కాషాయ జెండా
మెదక్, జూన్ 4 (విజయక్రాంతి): మెదక్ పార్లమెంట్ స్థానంలో కాషాయ జెండా ఎగిరింది. ఎంపీగా ఎం రఘునందన్‌రావు విజయఢంకా మోగించారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుపై 39,139 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈ స్థానం నుంచి పోటీ చేసిన బీఆర్‌ఎస్ అభ్యర్థి పీ వెంకట్రామి రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు. మెదక్ లోక్‌సభ ఓట్ల లెక్కింపును నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ, అల్లూరి సీతారామరాజు కళాశాలలో చేపట్టారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను రెండు రౌండ్లలో లెక్కించారు. మొత్తం 14,315 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకుగాను బీజేపీకి 7440, కాంగ్రెస్‌కు 4179, బీఆర్‌ఎస్‌కు 1540 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 307 ఇన్‌వాలిడ్, 665 తిరస్కరణకు గురికాగా నోటాకు 35 ఓట్లు పోలయ్యాయి. మెదక్ లోక్‌సభ పరిధిలో మొత్తం 18,28,210 ఓటర్లు ఉండగా 13,72,874 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు..
మెదక్ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు 23 రౌండ్ల వారీగా పోలైన ఓట్లను వెల్లడించారు. మొదటి, రెండో రౌండ్‌లో బీఆర్‌ఎస్ లీడ్ ఇవ్వగా, మూడో రౌండ్‌లో బీజేపీ ఆధిక్యత సాధించింది. 4, 5వ రౌండ్‌లో బీఆర్‌ఎస్ మళ్లీ లీడ్ ఇవ్వగా, 6వ రౌండ్ నుంచి 18వ రౌండ్ వరకు బీజేపీ ఆధిక్యతను సాధించింది. 7వ రౌండ్ వరకు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు మూడో స్థానంలో ఉండగా, 8వ రౌండ్ నుంచి రెండో స్థానానికి ఎగబాకారు. బీఆర్‌ఎస్ 8వ రౌండ్ నుంచి మూడో స్థానానికి పడిపోయింది. మళ్లీ 19వ రౌండ్‌లో బీఆర్‌ఎస్ లీడ్ ఇచ్చింది. మొత్తంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 39,139 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు.
చతికిలపడిన బీఆర్‌ఎస్..
తెలంగాణ ఉద్యమగడ్డగా పేరు గాంచిన మెదక్ జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ చతికిలపడింది. 2004 నుంచి రెండు దశాబ్దాలుగా బీఆర్‌ఎస్ జెండా ఎగిరిన మెదక్ లోక్‌సభ స్థానంలో ఈసారి జరిగిన ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయింది. అయితే మెదక్ లోక్‌సభ పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందినప్పటికీ ఎంపీ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిద్దిపేట సెగ్మెంట్లలో బీఆర్‌ఎస్ ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టమవుతోంది.






