దేశాన్ని ముక్కలు చేసేందుకు బీజేపీ కుట్ర
- మనుధర్మం అమలుకు కేంద్రం ప్రయత్నం
- టీ పీసీసీ అధికార ప్రతినిధి లింగం యాదవ్
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న భారతదేశాన్ని ముక్కలు చేయాలని బీజేపీ చూస్తోందని టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగంయాదవ్ ఆరోపించారు. ఈ దేశానికి భవిష్యత్తు అయిన విద్యా వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. చదువును కూడా కాషాయీకరణ చేయాలనే కుట్ర జరుగుతుందన్నారు. భూతవైద్యం అనే కోర్సు పెట్టీ దేశాన్ని ఏమి చేయాలనుకుంటుందో చెప్పాలన్నారు.
కేంద్రం మూఢ నమ్మకాలతో పోటీ పడుతుంటే, తెలంగాణ ఏఐకి హబ్‌గా అవతరిస్తుందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ పీఠికలో నుంచి సోషలిజం, సెక్యులరిజం అనే పదాలే తీసేస్తే బీజేపీకి ఎంత భయం పట్టుకుంది అనేది అర్థమవుతుందన్నారు. మనుధర్మశాస్త్రం అమలు చేయాలని బీజేపీ నేతల తీరు చూస్తుంటే అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. బీజేపీ కుట్రపూరితంగా సెక్యులరిజం అనే పదం తీయవచ్చని, కానీ ప్రజల మనసు నుంచి తొలగించలేరని ఆయన హితవు పలికారు.
1973లోనే సుప్రీంకోర్టు సెక్యులరిజం దేశ ఆత్మ అని చెప్పిందన్నారు. బీజేపీకి ఓటు అనే ఆయుధంతో ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. దేశంలో ఇప్పటీ వరకు 80కి పైగా పేపర్లు లీక్ అయ్యాయని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని లింగంయాదవ్ డిమాండ్ చేశారు.






