24 April, 2026 | 7:48 AM

మార్కెట్లకు బ్లాక్ మండే!

25-02-2025 02:30 AM

రూ.4లక్షల కోట్ల సంపద ఆవిరి

ముంబై: దేశీయ మార్కెట్లపై బేర్ పట్టు కొనసాగుతోంది. ట్రంప్ టారిఫ్ భయాల నుంచి సూచీలు కోలుకోవట్లేదు. దీనికితోడు భౌగోళిక రాజకీయ పరిస్థితులు, విదేశీ మదుపర్ల అమ్మకాలు మార్కెట్లను మరింత ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి.

ఫలితంగా సోమవారం సెషన్‌లో సూచీలు భారీ పతనాన్ని చవిచూశాయి. మార్కెట్లు ఏకంగా 8 నెలల కనిష్ఠాలకు పడిపోగా.. ఈ ఒక్క రోజే దాదాపు రూ.4లక్షల కోట్లకు పైగా మదుపర్ల సంపద ఆవిరైంది. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఏకంగా 850 పాయింట్లు పతనమవగా.. నిఫ్టీ 200 పాయింట్లకు పైగా కుంగింది.

రోజంతా నష్టాలే..

అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో ఈ ఉదయం 74,893 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా అదే ఒరవడి కొనసాగించింది. ఒక దశలో 900 పాయింట్లకు పైగా దిగజారి 74,387 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరకు 856.66 పాయింట్లు నష్టపోయి 74,454.41 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ242.55 పాయింట్లు పతనమై 22,553.35 వద్ద ముగిసింది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 4 పైసలు క్షీణించి 86.72 వద్ద స్థిరపడింది. ఆటో, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ మినహా  దాదాపు అన్ని రంగాల షేర్లు కుదేలయ్యాయి. ముఖ్యంగా ఐటీ, మెటల్, టెలికం సూచీలు 2 శాతం మేర కుంగాయి.

నిఫ్టీలో విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టాటా స్టీల్ షేర్లు నష్టాలను చవిచూశాయి. మహింద్రా అండ్ మహింద్రా, ఐషర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటార్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.

మార్కెట్ పతనానికి కారణాలు

విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే రూ.3,449.15 కోట్ల మేర పెట్టుబడులను విదేశీ మదుపర్లు వెనక్కి తీసుకున్నారు. ఫిబ్రవరి మొత్తంలో రూ.23,740 కోట్ల విదేశీ పెట్టుబడులు తరలిపోయాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐ అమ్మకాలు ఏకంగా రూ.లక్ష కోట్లు దాటడం గమనార్హం. ఈ ప్రభావం సూచీలపై తీవ్రంగా పడింది.

అమెరికాలో ట్రంప్ అధిక టారిఫ్‌ల అమలుతో అక్కడ ద్రవ్యోల్బణం ఎక్కువగా నమోదు కావొచ్చని, దాంతో బాండ్ల ప్రతిఫలాలు పెరిగి భారత్ వంటి వర్ధమాన విపణుల్లో విదేశీ మదుపర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపబోరని బ్రోకరేజీ సంస్థ నోమురా అంచనా వేస్తోంది.

ఇక, రూపాయి పతనం, అమెరికా డాలర్ రిజర్వ్లు తగ్గడం, దేశీయంగా కార్పొరేట్ సంస్థల డిసెంబరు త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండటం, జీడీపీ వృద్ధిపై ఆందోళనలు మదుపర్ల సెంటిమెంట్‌ను బలహీనపరుస్తున్నాయి.