నాగ్‌పూర్ పరిశ్రమలో పేలుడు: ఐదుగురు మృతి
మహారాష్ట్ర: నాగ్ పూర్ సమీపంలోని పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. పరిశ్రమలో బాణసంచా పేలుడుతో ఈ ప్రమాదం జరిగింది. పరిశ్రమలో ప్రస్తుతం సహయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నట్లు నాగ్‌పూర్ పోలీసు కమిషనర్ రవీందర్ సింఘాల్ తెలిపారు. ఇక్కడికి 25 కిలోమీటర్ల దూరంలోని హింగ్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని ధామ్నా గ్రామంలోని చాముండి ఎక్స్‌ప్లోజివ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఈ సంఘటన జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఘటనా స్థలంలో ఎన్సీపీ-ఎస్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ కూడా ఉన్నారు. కార్మికులు పేలుడు పదార్థాలను ప్యాక్ చేస్తున్న సమయంలో మధ్యాహ్నం 1 గంటలకు పేలుడు సంభవించిందని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని స్థానిక పోలీసు అధికారి తెలిపారు.






