26 August, 2026 | 7:57 PM

సర్ పై గ్రామ సభలు నిర్వహించాలి: బోధన్ ఆర్డీఓ

26-08-2026 07:20 PM

- బోధన్ నియోజకవర్గ పరిధిలోని మండలాల్లోని గ్రామాల్లో ఆగస్టు 27న గ్రామ సభలు నిర్వహించాలి

బోధన్,(విజయక్రాంతి): ప్రత్యేక సమగ్ర సవరణ (సర్–2026) కార్యక్రమంలో భాగంగా బోధన్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో ఆగస్టు 27న గ్రామ సభలు నిర్వహించాలని బోధన్ నియోజకవర్గ ఎన్నికల నోడల్ అధికారి, బోధన్ ఆర్డీఓ ఎం. విజయ కుమారి సూచించారు.

ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభల్లో మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, నివాసం మారిన వారి పేర్లపై పరిశీలన, డబుల్ ఎంట్రీ అయిన ఓటర్ల గుర్తింపు, అర్హులైన కొత్త ఓటర్లను జాబితాలో చేర్చడం వంటి అంశాలపై ప్రజలకు వివరించనున్నారు.

ప్రతి ఓటరు, గ్రామ ప్రజలు ఈ సభలకు తప్పనిసరిగా హాజరై సవరణ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆర్డీఓ కోరారు. ఓటర్ జాబితాలో తమ పేరు, వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. గ్రామాల్లో తప్పుడు, చెల్లని లేదా మరణించిన ఓటర్లకు సంబంధించిన వివరాలు ఉంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ముఖ్యంగా బి ఎల్ ఓ,  సూపర్‌వైజర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ సిబ్బంది ప్రజలకు అవసరమైన సహకారం అందిస్తారని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు ఉండేలా, అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్డీఓ తెలిపారు. “ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో సరైన ఓటర్ జాబితా కీలకం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి” అని ఆమె పిలుపునిచ్చారు. ఓటర్లకు మరింత సమాచారం కోసం 1950 టోల్‌ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.