అనుమతి లేని డీజే వాహనం సీజ్
- ర్యాలీ నిర్వాహకులు, డీజే, వాహన యజమానులపై కేసులు
- ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్ స్పెక్టర్ నాగరాజు
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ర్యాలీలో అనుమతులు లేకుండా అధిక శబ్దం వచ్చేలా డీజే ఏర్పాటు చేసిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్ స్పెక్టర్ కే నాగరాజు తెలిపారు. బుధ వారం పట్టణంలోని జై జవాన్ నగర్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు నిర్వహించిన ర్యాలీలో అనుమతులు లేకుండా మితిమీరిన శబ్దంతో ఊఫర్లు ఏర్పాటు చేసి డీజే నిర్వహిస్తున్నట్లు గుర్తించి డీజేను, వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. ర్యాలీ నిర్వాహకుడు షర్ఫుద్దీన్, డీజే యజమాని గణేష్, వాహన యజమాని మహమ్మద్ ఇర్ఫాన్ తో పాటు మరికొంత మంది ర్యాలీ నిర్వాహకులపై టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతులు లేకుండా అధిక శబ్దంతో డీజేలు ఏర్పాటు చేసి ర్యాలీలు నిర్వహించే నిర్వాహకులు, డీజే యజమానులు, వాహన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు డీజేలు, వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని, అనుమతులు లేకుండా ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించడం, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా అధిక శబ్దంతో డీజేలు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ప్రజలు పోలీసుల సూచనలు, నిబంధనలు పాటించి సహకరించాలని కోరారు.






