3 August, 2026 | 4:43 AM

ఢిల్లీ నిరసనల్లో అల్లర్లకు ఉగ్రకుట్ర

03-08-2026 02:03 AM

భగ్నం చేసిన పశ్చిమ బెంగాల్ ఎస్టీఎఫ్

అనుమానితుడు హమీమ్, సహకరించిన యువతి అరెస్ట్

నిందితులకు జైషే మహ్మద్ ఉగ్రసంస్థతో లింక్‌లు

కోల్‌కతా, ఆగస్టు 2: పశ్చిమ బెంగాల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న హమీమ్ మోండల్ అనే అనుమానితుడిని పూర్బా బర్ధమాన్ జిల్లాలో అరెస్ట్ చేశారు.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసన ప్రదర్శనలోకి పోలీసు యూనిఫామ్‌లో ప్రవేశించి అలజడి సృష్టించాలని పాకిస్తాన్ హ్యాండ్లర్లు అతనికి ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయాలను ఎస్టీఎఫ్ ఐజీ గౌరవ్‌శర్మ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి కూడా ఈ ఉగ్రవాది ప్రధాన లక్ష్యాలలో ఒకరిగా ఉన్నట్లు ఎస్టీఎఫ్ తెలిపింది. సీఎం కదలికలపై నిఘా ఉంచాలని, ఆయనకు భద్రత లేని ప్రాంతాల సమాచారా న్ని సేకరించాలని హమీమ్‌ను పాకిస్తాన్ ప్రతినిధులు కోరారు.

విచారణలో పశ్చిమ బెంగాల్లోని పలువురు జైషే మహమ్మద్ హ్యాండ్లర్లతో ఇతనికి ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. ప్రస్తుతం కోర్టు అతనికి 14 రోజుల ఎస్టీఎఫ్ కస్టడీ విధించింది. ఈ కేసులో హమీమ్ గర్ల్ ఫ్రెండ్ అర్పితా సర్కార్‌ను శుక్రవారం జార్ఖండ్‌లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి రాష్ట్ర మంత్రి ఉమేష్ రే కుమారుడిని హనీట్రాప్ చేసి, కిడ్నాప్ ద్వారా డబ్బు వసూలు చేయడానికి కుట్ర పన్నారు. పాకిస్తాన్లోని షెహజాద్ భట్టీ గ్యాంగ్ ఆదేశాలతో వీరు పనిచేస్తు న్నట్లు తెలిసింది.

వీరి వద్ద నుంచి యూకే, మెక్సికో దేశాలకు చెందిన సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌స్క్రిప్టెడ్  కమ్యూనికేషన్ కోసం వీటిని ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా హమీమ్‌కు అర్పిత పరిచయమైంది. ఆమె సోషల్ మీడియా ఖాతాను విచారించడం ద్వారానే పోలీసులు హమీమ్ అడ్రస్ కనుగొన్నారు. సరిహద్దుల అవతల ఉన్న ఈ ఉగ్ర నెట్‌వర్‌క పూర్తి వివరాలను సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.