సందర్శకులకు బొగత జలపాతం మాత్రమే శ్రేయస్కరం
వాజేడు (విజయక్రాంతి): ప్రకృతి ప్రియులకు సందర్శకులకు బొగత జలపాతం(Bogatha Waterfall) సందర్శన మాత్రమే శ్రేయస్కరం అని ములుగు జిల్లా ఫారెస్ట్ అధికారి రాహుల్ కిసాన్ యాదవ్(District Forest Officer Rahul Kisan Yadav) ప్రకటన ద్వారా సోమవారం తెలియజేశారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో బొగత జలపాతం తెరిచి ఉంచామని, ప్రజలు ప్రకృతి ప్రియులు జలపాతాన్ని సందర్శించి ప్రకృతి అందాలను ఆస్వాదించాలని పేర్కొన్నారు.
జలపాత సందర్శన సమయంలో అధికారుల నిబంధనలను పాటించాలని తెలిపారు. మండలంలో అటవీ ప్రాంతాల్లో దాగివున్న ఇంకా కొన్ని జలపాతాల గురించి సోషల్ మీడియాలో, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, ఎక్స్ లో కొన్ని గ్రూపులలో జలపాతం మార్గాల గురించి పోస్టింగులు పెట్టినట్లు నిర్ధారించామని అన్నారు. సోషల్ మీడియా పోస్టింగ్స్ లో పేర్కొన్న రహదారులు ప్రమాదకరమని, అదేవిధంగా స్థానిక గ్రామస్తులు చూపించేదారులు కూడా ప్రమాదానికి గురిచేస్తాయని, ఆ రహదారులు అధికారికంగా నిషేధించబడినయని హెచ్చరించారు.
అధికారులు నిషేధించిన మార్గాల ద్వారా జలపాతాలను సందర్శించినట్లయితే తెలంగాణ అటవీ చట్టం 1967 సెక్షన్ 20 క్రింద శిక్షార్హులవుతారని పేర్కొన్నారు. పర్యాటకులకు బొగత జలపాతంలో మాత్రమే అధికారులు భద్రత కల్పిస్తారని తెలియజేశారు. కావున బొగత జలపాతాన్ని సందర్శించుటకు నిర్భయంగా రావచ్చని తెలిపారు.






