కూలిన బొలీవియా విమానం
15 మంది దుర్మరణం, 30 మందికి గాయాలు
కొత్త నోట్లను తరలిస్తుండగా సాంకేతిక లోపం
రోడ్డుపై చెల్లాచెదురుగా కరెన్సీ.. తీసుకునేందకు ఎగబడిన ప్రజలు
లాపాజా, ఫిబ్రవరి 28 : బొలీవియా రాజధాని లా పాజ్ సమీపంలో ఎల్ ఆల్టో నగరంలో శుక్రవారం కొత్త నోట్ల కట్టలు తరలిస్తున్న బొలీవియన్ వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ విమానం సాంకేతిక లోపంతో ఓ విమానం రన్వేపై జారి హైవే పైకి దూసుకెళ్లి, కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. 30 మంది గాయపడ్డారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం సంభవించింది.
లా పాజ్ సమీపంలో ఎల్ ఆల్టో నగరంలో బొలీవియన్ వైమానిక దళానికి చెందిన విమానం సెంట్రల్ బ్యాంక్ నుంచి కొత్త నోట్లను తీసుకుని బయలుదేరింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక, సాంకేతిక లోపంతో ల్యాండింగ్ సమయంలో రన్వే నుంచి పక్కకి జారిపోయింది. ఈ క్రమంలో రద్దీగా ఉన్న రోడ్డు పైకి దూసుకెళ్లి పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 15మంది మరణించగా.. 30మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. విమానం జనసంచారం ఉన్న ప్రాంతంలో కూలిపోవడంతో మృతుల సంఖ్య మరితం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మృతుల్లో విమానంలో ఉన్నవారితో పాటు.. రోడ్డుపై వెళ్తున్న పౌరులు కూడా ఉన్నారని స్థానిక అధికారులు ధ్రువీకరించారు.
గాయపడినవారిని సమీప ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ బ్యాంక్ నుంచి కొత్తగా ముద్రించిన కరెన్సీని ఇతర నగరాలకు తరలిస్తుండగా.. ఈ ఘటన జరిగిందని దేశ రక్షణ మంత్రిత్వశాఖ అధికారులు పేర్కొన్నారు.
విమానంలోని కరెన్సీ నేలపై చెల్లాచెదురుగా పడిపోయిన దృశ్యాలు సోషల్‌మీడియా వేదికల్లో వైరల్ అవుతున్నాయి. అక్కడి ప్రజలు వాటిని తీసుకునేందుకు పోటీపడుతుండగా పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంతో ఎల్ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు జాతీయ విమానయాన సంస్థ బొలీవియా డీ ఏవియాసియన్ రాయిటర్స్ పేర్కొంది.




