22 August, 2026 | 3:36 PM

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా బొంపెల్లి భవాని

22-08-2026 03:00 PM

తెలంగాణ రాష్ట్రం నుండి ఒక్కరికే అవార్డు..

గాంధారి, ఆగస్టు 22 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని  ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న బొంపెల్లి భవాని జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా(National Best Teacher) ఎంపికయ్యారు. కేంద్రప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన 48 మంది జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుండి బొంపెల్లి భవాని ఒక్కరికే చోటు దక్కింది. ఉపాధ్యాయదినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి చేతులమీదుగా ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు. మండల కేంద్రానికే చెందిన బొంపెల్లి భవాని 2024లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా, 2025లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డులు అందుకున్నారు. బోధనలో వినూత్న పద్ధతులను అవలంబిస్తూ, డిజిటల్ విద్యను విద్యార్థులకు చేరువ చేస్తూ యూట్యూబ్ వేదికగా విద్యా విప్లవం సృష్టిస్తున్న భవాని సేవలను గుర్తించి కేంద్రం ఈ అరుదైన గౌరవాన్ని ప్రకటించింది..

విద్యార్థుల్లో అభ్యసన లోపాలను గుర్తించి, సులభంగా అర్థమయ్యేలా పాఠాలు చెప్పడం, TLM లతో బోధించడం, యూట్యూబ్ ఛానల్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందించడం ఆమె ప్రత్యేకత.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. ఈ అవార్డు తన ఒక్కరి విజయం కాదని, తన విద్యార్థులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయ మిత్రులందరి విజయం అని ఆమె పేర్కొన్నారు. మండల కేంద్రానికి చెందిన భవానికి జాతీయ స్థాయిలో అవార్డు రావడంతో గ్రామ పెద్దలు, మండల ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి, కామారెడ్డి జిల్లాకు, గాంధారి మండలానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన భవానికి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి..