22 August, 2026 | 3:44 PM

నేరాలకు తావులేకుండా సంతోషంగా బతకాలి

22-08-2026 03:06 PM

సర్దుకుపోయే తత్వం అలవర్చుకోవాలి

మందమర్రి, (విజయక్రాంతి): సమాజంలో తోటి వారిని గౌరవించుకుంటూ, నేరాలకు తావులేకుండా సంతోషంగా బ్రతకాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి నగేష్ భీమపాక అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలో ఏర్పాటు చేసిన కోర్ట్ ఆఫ్ జూనియర్ సివిల్ జడ్జ్ - కమ్ - జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ప్రారంభ కార్యక్రమానికి మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు ఎ.వీరయ్య, శారదా దేవి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల జిల్లా రెండవ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్, మందమర్రి కోర్ట్ ఆఫ్ జూనియర్ సివిల్ జడ్జ్ - కమ్ - జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఇంచార్జ్ జడ్జ్ కె.నిరోష, రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా, మందమర్రి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ, మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్త సత్తయ్యలతో కలిసి హాజరై గౌరవ వందనం స్వీకరించి మొక్కలు నాటిన అనంతరం మూడు మతాల పెద్దల సమక్షంలో కోర్టు భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ.. కోర్టు భవనాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని పండుగలా జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి పట్టణాలలో కోర్టు భవనాలను ప్రారంభించడం ద్వారా కేసుల పరిష్కారం మరింత వేగవంతం అవుతుందన్నారు. జిల్లాలో అవసరమైన న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ ప్లీడర్లు, అందుబాటులో ఉన్నారని, కేసుల పరిష్కారంలో తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. అంతకుముందు మందమర్రి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయస్థానాల అధికారులు, సిబ్బంది, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.