22 August, 2026 | 3:44 PM

వెంకట రామారెడ్డి ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి

22-08-2026 03:05 PM

విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట,ఆగస్టు 22(విజయక్రాంతి): రాజా బహదూర్ కొత్వాల్ వెంకట రామారెడ్డి(Raja Bahadur Kotwal Venkata Rama Reddy) 157వ జయంతి సందర్భంగా సిద్దిపేట రెడ్డి సంక్షేమ భవన్‌లో శనివారం విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు(Siddipet MLA Tanniru Harish Rao) విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. వెంకట రామారెడ్డి విద్యాభివృద్ధి, సామాజిక చైతన్యం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. తాను ఎదగడంతో పాటు మరో పది మందిని పైకి తీసుకెళ్లాలన్న ఆయన ఆశయాలను నేటి తరం కొనసాగించాలని పిలుపునిచ్చారు.బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ విద్యా వికాసానికి వెంకట రామారెడ్డి చేసిన కృషి ఆదర్శమన్నారు. ఆయన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.

రెడ్డి కులస్థులకు గత ప్రభుత్వం కేటాయించిన ఆత్మగౌరవ భవన్ స్థలాన్ని తిరిగి కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. వెంకట రామారెడ్డి ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డా.యాదవ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు వంగ తిరుమల్ రెడ్డి, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, మాణిక్య రెడ్డి,జాప శ్రీకాంత్ రెడ్డి,సోమిరెడ్డి,ఎల్లారెడ్డి ప్రజాప్రతినిధులు, రెడ్డి సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై వెంకట రామారెడ్డికి ఘనంగా నివాళులర్పించారు.