షైన్ పాఠశాలలో బోనాల పండుగ
తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత : షైన్ పాఠశాల కరెస్పాండెంట్ భానుచందర్
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని షైన్ పాఠశాల కరెస్పాండెంట్ భానుచందర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక షైన్ 2.0 పాఠశాలలో శుక్రవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అమ్మవారు, పోతరాజు, బోనం తదితర వేషధారణతో నిర్వహించిన బోనాల ఊరేగింపు, జానపద నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.
దీంతో పాఠశాల ఆవరణం అంతా పండుగ వాతావరణంతో నిండిపోయింది. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ బోనాల పండుగ చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో మన సంస్కృతిపై గౌరవాన్ని, సంప్రదాయాల పట్ల అవగాహనను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ స్రవంతి, ఇంచార్జి రాజేష్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.






