3 August, 2026 | 1:43 AM

బాన్సువాడ నియోజకవర్గంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు

03-08-2026 12:40 AM

బోనమెత్తిన పోచారం, కాసుల, భాస్కర్ రెడ్డి

బాన్సువాడ, ఆగస్టు 2 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం ఘనంగా బోనాల పండుగ వేడుకలను నిర్వహించారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని కోటగల్లి, కోటదుర్గమ్మ ఆలయంలో, సాయికృప నగర్ ఫేస్ 2 కాలనీలో మైసమ్మ ఆలయంలో రుద్రూర్ పోచమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల ఆషాఢపలు గ్రామాలు, పట్టణాల్లో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఉదయం నుంచే అమ్మవారి ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలతో ఊరేగింపుగా ఆలయాలకు చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. డప్పు వాయిద్యాలు, పోతురాజు విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసి పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పోచారం సురేందర్ రెడ్డి లతోపాటు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వయంగా బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు, ఆలయ కమిటీలు, స్వచ్ఛంద సేవకులు తగిన ఏర్పాట్లు చేశారు. బోనాల ఉత్సవాలు భక్తుల ఆనందోత్సాహాల నడుమ వైభవంగా ముగిశాయి.