3 August, 2026 | 2:37 AM

అన్నదాతల శ్రమదోపిడీ.. రైతులకు గిట్టుబాటు ధర కరువు

03-08-2026 12:42 AM

జుక్కల్, ఆగస్టు 2 (విజయక్రాంతి): జుక్కల్ మండలంలోని రైతులు పండించిన జొన్న పంట ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి సుమారు రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు వారి ఖాతాలో డబ్బులు జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పెద్ద ఏడికి గ్రామానికి చెందిన మారుతి పటేల్ అనే రైతు కు డబ్బులు రాలేదని ఆవేదన చెందారు.

ప్రైవేటు లారీల్లో జొన్నలు తరలించినందుకు కాంట్రాక్టర్ ఆయన భారీ భాయ్ తమకు సతాయిస్తున్నారని ఆరోపిస్తున్నాడు. తాను చెప్పింది వేదం అంటూ రైతులకు బెదిరిస్తున్నాడని ఆయన చెప్పాడు. కామారెడ్డి జిల్లా మొత్తంలో రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, కూలీల వ్యయం, సాగు పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ మార్కెట్లో వ్యాపారులు తక్కువ ధరలు చెప్పడంతో రైతులు నష్టపోతున్నారని ఆరోపిస్తున్నారు.

రైతులు పంటను మార్కెట్కు తీసుకువచ్చిన తర్వాత నాణ్యత పేరుతో ధర తగ్గించడం, తూకాల్లో అవకతవకలు, చెల్లింపుల్లో ఆలస్యం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. కొన్ని చోట్ల కమిషన్ ఏజెంట్ల ఆధిపత్యం కారణంగా రైతులకు సరైన ధర అందడం లేదని వాపోతున్నారు. మరోవైపు, వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు పెరిగిపోవడంతో సాగు వ్యయం మరింత భారంగా మారింది. దీంతో అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్న రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జుక్కల్ మండలంలోని రైతులకు కనీస మద్దతు ధర అమలు చేయడంతో పాటు, మధ్యవర్తుల దోపిడీని అరికట్టి, మార్కెట్లో పారదర్శకత తీసుకురావాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇటీవల లొంగన్ గ్రామానికి చెందిన 16 మంది రైతులు సొసైటీ కార్యాలయానికి వచ్చి అవుకతోకలపై అధికారులకు నిలదీశారు. సమస్య ఎక్కడుందో తెలుసుకొని సమస్యలను పరిష్కరిస్తామని సొసైటీ సిబ్బంది వారికి హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు.

అదేవిధంగా రైతులకు ఈ విధంగా కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం అధికారులకు సంబంధిత కాంట్రాక్టర్లకు సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా లారీల కాంట్రాక్టర్లు చెప్పిందే విధంగా తయారైందని రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడం లేదని వాపోతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి సంబంధించినపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు  విజ్ఞప్తి చేస్తున్నారు.