బోనాలకు రూ. 20 కోట్ల నిధులు
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (విజయక్రాంతి) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాల ఏర్పాట్లు ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం రూ. 20 కోట్ల నిధులను మంజూరు చేసినట్టుగా శనివారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని దేవాదాయ శాఖ కమిషనర్లతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి పరిధిలోని ప్రధాన దేవాలయాలతో పాటు ఇతర దేవాలయాలు అలంకరణ, పట్టు వస్త్రాల కొనుగోలు, బోనాల ఏర్పాట్లు, విద్యుత్, సాంస్కృతిక కార్యక్రమాల అవసరాలకు ఈ నిధులు వినియోగించాలని కోరారు.
రాష్ట్రస్థాయి బోనాల ఉత్సవ చైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ పొన్నం ప్రభాకర్ గౌడ్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శితో కలుపుకొని మొత్తం 7 గురు సభ్యులతో కమిటీ వేసినట్టుగా ప్రకటించారు. ప్రధాన దేవాలయాలకు ఉత్సవ కమిటీల ఎంపిక ప్రక్రియ రెండు, మూడు రోజుల్లో పూర్తవుతుందన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ ఖ్యాతి ఇనుమడించేలా ఉత్సవాలను జరపాలని అధికారులను ఆదేశించారు.






