అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకి బొప్పిడి వినతి
కడ్తాల్, జూలై 20 (విజయక్రాంతి): కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి సోమవారం జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ బొప్పిడి గోపాల్ వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో ప్రజాప్రతినిధులతో కలసి ఆయన మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు సహా మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే.. త్వరలోనే నిధులు మంజూరు చేసి రావిచేడ్ గ్రామ సమగ్రాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
అభివృద్ధిలో రాజకీయాలకతీతంగా అందరూ కలిసికట్టుగా ఉంటూ సమన్వయంతో ముందుకు వెళ్తేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్ బందరి యాదయ్య, వార్డు సభ్యులు రవికుమార్, హనుమంతు నాయక్, భూపతి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






