21 July, 2026 | 10:51 PM

Breaking News

ప్రజావాణిలో కునుకుతీస్తున్న అధికారులు

21-07-2026 10:09 AM

నాగర్ కర్నూల్ జులై 20(విజయక్రాంతి): ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి(Prajavani) కార్యక్రమంలో సుదూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజల నుండి వినతులు స్వీకరించాల్సిన అధికారులు సోమవారం అదే వేదికపై కునుకు తీస్తూ కనిపించారు. గతంలో ప్రజావాణి కార్యక్రమం అంటేనే వచ్చామా వెళ్ళామా అన్న రీతిలో నడుస్తున్న క్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్(District Collector Hemant Keshav Patil) సమూల మార్పులు తీసుకొచ్చారు.

ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ప్రజలు తమ సమస్యలను నేరుగా ఆ శాఖ అధికారికి చెప్పుకునేలా ఏర్పాట్లు చేశారు. కొన్ని వారాలుగా సవ్యంగా జరుగుతున్నప్పటికీ సోమవారం ఉమ్మడి పాలమూరు జిల్లా వేదికగా ఎల్నినో ప్రభావం వల్ల ప్రత్యామ్నాయ పంటలు వంటి అంశాలపై ప్రత్యేక సమావేశానికి జిల్లా కలెక్టర్ తో పాటు మరి కొందరు అధికారులు వెళ్లడంతో స్థానిక జిల్లా అధికారులు ప్రజావాణిని పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. కొంతమంది అధికారులు ఫోన్లో గేమింగ్ ఆడుతూ కనిపించగా మరి కొంతమంది గాఢ నిద్రలో కునుకు తిస్తూ కనిపించారు.