ముత్తారంలో పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
ముత్తారం, జూలై 21(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) సోమవారం ముత్తారం మండలంలో పలు కుటుంబాలను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మండలానికి చెందిన బాలసాని మొగిలి, కోల లక్ష్మి, రాపల్లి కొమురయ్య ఇటీవల మృతి చెందగా, అలాగే మారం వెంకట్ రెడ్డి కరెంటు షాక్‌కు గురై మృతి చెందిన నేపథ్యంలో ఆయా కుటుంబాలను మంత్రి స్వయంగా సందర్శించారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి, కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు.
ప్రభుత్వం తరఫున అందాల్సిన సహాయ సహకారాల విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆనుము రామస్వామిని పరామర్శించిన మంత్రి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్య చికిత్స పొందాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






