15 May, 2026 | 2:04 AM

బోరేపల్లి బెటర్!

15-05-2026 01:13 AM
  1. తుమ్మిడిహట్టి డిజైన్‌పై సందేహాలు
  2. సంగమ ప్రాంతం సాంకేతికంగా క్లిష్టం 
  3. తప్పనిసరి కానున్న మోడల్ స్టడీస్
  4. బోరేపల్లిని ప్రత్యామ్నాయంగా పరిశీలించాలని రిటైర్డ్ ఇంజినీర్ల సూచన

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి) : ప్రస్తుతం తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టుల్లో తుమ్మిడిహట్టి వద్ద ప్రభుత్వం నిర్మించబోతున్న ప్రాణహిత ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర విభజనకు ముందు భారీ అంచనాలతో రూపొందించిన ఈ ప్రాజెక్టు, ఆ తర్వాత కాళేశ్వరం రూపం లో మార్పులు, డిజైన్ల మార్పుతో రాజకీయంగా, సాంకేతికంగా ఎన్నో మలుపు లు తిరిగింది. అయితే ఇప్పుడు మళ్లీ తుమ్మిడిహట్టి బరాజ్ అంశం తెరపైకి రావడంతో ప్రాజెక్టు డిజైన్, స్థల ఎంపిక, భవిష్యత్ భద్రతపై కొత్త చర్చ మొదలైం ది.

ముఖ్యంగా ఈసారి విమర్శలు రాజకీయ వర్గాల నుంచి కాకుండా ఇరిగేషన్ రంగంలో అనుభవం ఉన్న రిటైర్డ్ ఇంజినీర్ల నుంచి రావడం ప్రాధాన్యత సంత రించుకుంది. తుమ్మిడిహట్టి ప్రతిపాదిత ప్రాంతం సాంకేతికంగా అత్యంత క్లిష్టమైనదని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల అసో సియేషన్ (టీఆర్‌ఈఏ) పేర్కొంటున్నది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి లేఖ కూడా అందజేసింది.

వారా-వైన్ గంగా నదుల సంగమ ప్రాంతంలో భారీ బరా జ్ నిర్మాణం చేపట్టాలంటే సాధారణ డిజైన్ అంచనాలు సరిపోవని, విస్తృతస్థాయి హైడ్రాలజికల్, హైడ్రాలిక్ మోడల్ స్టడీస్ తప్పనిసరిగా నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇంజినీర్ల అభిప్రాయం ప్రకారం సమస్య మొత్తం సంగమం చుట్టూనే తిరుగుతోంది. సాధారణంగా ఒకే నదిపై బరాజ్ నిర్మాణం, ప్రవాహ స్వభావాన్ని సులభంగా అంచనావేసే అవకాశం ఉం టుంది.

కానీ రెండు పెద్ద నదులు కలిసే ప్రాంతంలో నిర్మాణం చేపట్టాలంటే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వార్ధా, వైంగంగా నదులకు వేర్వేరు క్యాచ్మెంట్ ప్రాం తాలు ఉన్నాయి. రెండు నదులపై పడే వర్షపాతం నమూనాలు, వరదల తీవ్రత, నీటి ప్రవాహ వేగం, పీక్ ఫ్లో టైమింగ్ అన్నీ వేర్వేరుగా ఉంటాయి. దీంతో ఒక నదిలో భారీ వరదప్రవాహం వస్తున్న సమయంలో మరో నదిలో తక్కువ ప్రవాహం ఉండే అవకాశం ఉంటుంది.

కొన్ని సందర్భాల్లో రెండు నదుల ప్రవాహాలు ఎదురెదురుగా ప్రభావం చూపే పరిస్థితి కూడా రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో బరాజ్ వద్ద నీటి ఒత్తిడి సమానంగా ఉండదని, నిర్మాణంపై అసమాన ప్రభావం పడే ప్రమాదం ఉందని టీఆర్‌ఈఏ అభిప్రాయపడుతోంది. ప్రత్యేకంగా 2.1 కిలోమీటర్ల లింక్ జోన్ ను ఇంజినీర్లు అత్యంత సున్నితమైన ప్రాంతంగా గుర్తిస్తున్నారు.

అక్కడ కృత్రిమ సంగమ పరిస్థితి ఏర్పడే అవకాశముందని, దీనివల్ల భారీ సుడిగుండాలు, క్రాస్ కరెంట్లు, హెలికల్ ఫ్లోస్, టర్బులెన్స్ వంటి క్లిష్ట ప్రవా హ పరిస్థితులు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇవి సాధారణ సమస్యలు కావని, దీర్ఘకాలంలో బరాజ్ పునాదులు, గేట్ల నిర్వహణ, సిల్టేషన్ నమూనాలు, వరదల విడుదల సామర్థ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.

బోరేపల్లి ప్రత్యామ్నాయం..?

మహారాష్ట్రతో కుదిరిన ఒప్పందం ప్రకారం తుమ్మిడిహట్టి బరాజ్ ఫుల్ రిజర్వాయర్ లెవల్ (ఎఫ్‌ఆర్‌ఎల్) 148 మీటర్లకు మాత్రమే పరిమితమైందని ఇంజినీర్లు గుర్తుచేస్తున్నారు. అంటే నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశాలు పరిమితంగానే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో క్లిష్ట సంగమ ప్రాంతంలో నిర్మాణం చేపడితే సాంకేతిక సమస్యలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఒకవైపు డిజైన్ పరిమితులు, మరోవైపు ప్రవాహాల అసమానత, మూడోవైపు మహారాష్ట్రలో ముంపు భయం వంటి అంశాలన్నీ తుమ్మిడిహట్టి ప్రాజెక్టును సాంకేతికంగా అత్యంత సున్నితమైన అం శంగా మార్చుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 

ఈ నేపథ్యంలో తుమ్మిడిహట్టికి దిగువన సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోరేపల్లి ప్రాంతాన్ని ప్రత్యామ్నాయంగా పరిశీలించాలని టీఆర్‌ఈఏ సూచించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారిం ది. రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె. విఠల్‌రావు ఇప్పటికే ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించినట్లు అసోసియే షన్ వెల్లడించింది.

బోరేపల్లి ప్రాంతంలో నది ప్రవాహ స్వభావం మరింత స్థిరంగా ఉండే అవకాశం ఉందని, సంగమ ప్రభావం తగ్గవచ్చని ఇంజి నీర్లు అంచనా వేస్తున్నారు. అక్కడ భౌగోళిక నిర్మా ణం, బ్యాక్‌వాటర్ ప్రభావం, వరదల వ్యాప్తి వంటి అంశాలను సమగ్రం గా పరిశీలిస్తే సాంకేతికంగా మెరుగైన పరిష్కారం దొరకవచ్చని భావిస్తున్నారు. అయితే ఇది కేవలం సూచన మాత్రమేనని, తుది నిర్ణయానికి ముందు సమగ్ర అధ్యయనాలు అవసరమని కూడా టీఆర్‌ఈఏ పేర్కొంది. 

ప్రభుత్వం నిర్ణయంపై ఆసక్తి..

తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల అసోసియేషన్ తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి సంబంధించి తాజాగా ప్రభుత్వానికి లేఖ అందించడంపై ప్రస్తుతం ఇరిగేషన్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వం ఈ సూచనలను ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందన్నదే ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రాణహిత ప్రాంతంపై తెలంగాణకు ఉన్న నీటి ఆశలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నా యి. అదే సమయంలో భారీ ప్రాజెక్టుల విషయం లో భవిష్యత్తు భద్రత, నిర్మాణ స్థిరత్వం, ఆర్థికవ్యయం వంటి అంశాలు కూడా కీలకంగా మారా యి.

అందుకే తుమ్మిడిహట్టి విషయంలో ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాల కంటే సాంకేతిక నిపుణుల సూచనలకు ప్రాధాన్యత ఇస్తుం దా..? లేక ఇప్పటికే ఉన్న ప్రతిపాదనలకే కట్టుబడి ముందుకు సాగుతుందా..? అన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణంపై మహారాష్ట్ర అభ్యంతరాలు, ఆ ప్రాంతంలో బరాజ్ నిర్మాణం సాధ్యం కాకపోవడంతోనే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టినట్టు బీఆర్‌ఎస్ పార్టీ వాదిస్తున్నది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు రిటైర్డ్ ఇంజినీర్లు బీఆర్‌ఎస్ వాదనకు బలం చేకూర్చే విధంగా ప్రభుత్వానికి లేఖ ఇవ్వడంతో ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారనున్నది. దీంతో తుమ్మడిహట్టి వద్ద బరాజ్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. 

మోడల్ స్టడీస్ జరపాలి..

సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) డీపీఆర్ ప్రమాణాల ప్రకారం హైడ్రాలిక్, హైడ్రాలజికల్, సెడిమెంట్ ట్రాన్స్‌పోర్ట్, వరద ప్రవాహ నమూనాలపై సమగ్ర మోడల్ స్టడీస్ నిర్వహించాలని రిటైర్డ్ ఇంజినీర్లు సూచిస్తున్నారు. ఇలాంటి అధ్యయనాల్లో సాధారణంగా కంప్యూటర్ సిమ్యులేషన్లతో పాటు ఫిజికల్ మోడల్స్ కూడా ఉపయోగిస్తారు. వరదల సమయంలో నీటి ప్రవర్తన ఎలా ఉంటుందో, ఎక్కడ ఒత్తిడి పెరుగుతుందో, ఎక్కడ సిల్ట్ పేరుకుపోతుందో, గేట్లపై లోడ్ ఎలా పడుతుందో ముం దుగానే అంచనా వేయవచ్చు.

పెద్ద ప్రాజెక్టుల్లో ఇవి అంతర్జాతీయ ప్రమాణాలుగా పరిగణిస్తారు. ప్రస్తుతం తుమ్మిడిహట్టి విషయంలో అలాంటి సమగ్ర అధ్యయనాల వివరాలు బహిరంగంగా అందుబాటులో లేవని, అందుకే ముందుగా పూర్తి స్థాయి సాంకేతిక పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణంనై భిన్న వాదనలు మొదలవడంతో మహారాష్ట్ర- జల వివాదాల అంశం కూడా మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంటుంది.

గతంలో ముంపు సమస్యల కారణంగా మహారాష్ట్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతోనే అసలు ప్రాజెక్టు రూపకల్పనలో మార్పు లు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో కాళేశ్వ రం ప్రాజెక్టు ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చిం ది. ఇప్పుడు మళ్లీ తుమ్మిడిహట్టి అంశం చర్చకు రావడంతో రెండు రాష్ట్రాల మధ్య కొత్త చర్చలు అవసరమయ్యే అవకాశం ఉందని ఇరిగేషన్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ముంపు తగ్గించే డిజైన్, తక్కువ ఎఫ్‌ఆర్‌ఎల్‌తో సాధ్యమైన నీటి నిల్వ, సాం కేతిక భద్రత వంటి అంశాలపై ఇరు రాష్ట్రాలు మరోసారి చర్చించాల్సి రావచ్చునని అంచనా.