ఎమ్మెల్యే సహకారంతో కళాశాల నూతన భవనానికి నిధులు సమకూరుస్తాం
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా
కొత్తగూడెం, మే 14, (విజయక్రాంతి): ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహకారంతో కళాశాల నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూరుస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా అన్నారు. శ్రీ రామచంద్ర ప్రభుత్వ ఆరట్స్, సైన్స్ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. పూర్ణచంద్ర రావు అధ్యక్షతన జరిగిన పూర్వ విద్యార్థి సంఘం సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ.. కళాశాల భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడటంతో పాటు, ప్రస్తుత భవనాలను విద్యార్థుల అవసరాలకు తగ్గట్టుగా తరగతి గదులుగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
యూజీసీ నిధులతో నిర్మించిన భవనాన్ని బాలికల హాస్టల్గా వినియోగించుకునేలా తక్షణమే అనుమతులు పొందాల్సిన అవసరం ఉందని, భద్రత దృష్ట్యా ప్రహరీ గోడ నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు చేస్తున్న కృషి కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షులు సందీప్, కార్యదర్శి కాసుల వెంకట్, సి పి ఓ సంజీవరావు, ప్రముఖ న్యాయవాది రబ్, రిటైర్డ్ అధ్యాపకులు డాక్టర్ ప్రసన్న కుమార్, డాక్టర్ ఉమామ హేశ్వరరావు, రామస్వామి, పాత్రికేయులు నాగాచారి, లోగాని శ్రీనివాస్, తారక రామారావు, రాజేష్, రవి, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.






