14 April, 2026 | 5:15 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

బాక్సింగ్ డే ఇంగ్లాండ్‌దే!

28-12-2025 12:00 AM

15 ఏళ్ల తర్వాత ఆసీస్‌లో విజయం

రెండు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్ 

ఏకపక్షంగా సాగిపోతున్న యాషెస్ సిరీస్‌లో ఎట్టకేలకు ఇంగ్లాండ్ బోణీ కొట్టింది.. బౌలర్ల హవా కొనసాగిన వేళ 175 పరుగుల టార్గెట్‌ను ఛేదించి ఆసీస్ జోరుకు బ్రేక్ వేసింది. అంతేకాదు 15 ఏళ్ల తర్వాత కంగారూల గడ్డపై తొలి టెస్ట్ విజయాన్ని రుచి చూసింది. దీంతో బాక్సింగ్‌డే టెస్టులో ఆతిథ్య ఆసీస్‌కు ఇంగ్లీష్ పంచ్ తప్పలేదు.

మెల్‌బోర్న్, డిసెంబర్ 27 : నిజానికి తొలిరోజు ఇంగ్లాండ్ బ్యాటింగ్ చూసిన వారెవరైనా ఆ జట్టు గెలుస్తుందని కనీసం ఊహించలేదు. ఎందుకంటే అంత చెత్తగా ఆడింది ఇంగ్లీష్ టీమ్. తొలి టెస్ట్ తరహాలోనే ఈ మ్యాచ్ రెండురోజుల్లోనే ముగిసిపోగా బౌలర్లు చెలరేగిపోయారు. కేవలం మొదటిరోజే 20 వికెట్లు పడ్డాయి. రెండోరోజు కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఓవరాల్‌గా రెండురోజుల ఆటలో మొత్తం 36 వికెట్లు పడడం చూస్తే బౌలర్లు ఏ స్థాయిలో ఆధిపత్యం కనబరిచారో అర్థమవుతోంది. వికెట్ నష్టపోకుండా 4 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 5 ఓవర్లు బాగానే ఆడింది. ఆ తర్వాత నుంచి ఇంగ్లాండ్ బౌలర్లు చెలరేగిపోయారు. ట్రావిస్ హెడ్ తప్పిస్తే ఏ ఒక్క బ్యాటర్ క్రీజులో నిలవలేకపోయాడు.

అంచనాలు పెట్టుకున్న లబూషేన్ , ఖవాజా, కామెరూన్ గ్రీన్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే వెనుదిరిగారు. వీరిలో ముగ్గురు డకౌటయ్యారు. ట్రావిస్ హెడ్ (46), స్మిత్ (24 నాటౌట్) పోరాడకుంటే కంగారూల స్కోరు 100 కూడా దాటేది కాదు. హెడ్ కాసేపు దూకుడుగా ఆడిన కీలక సమయంలో ఔటయ్యాడు. బ్రైడెన్ కార్స్ 4 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు.  దీంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 42 పరుగులను కులుపుకుని 175 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లాండ్ ముందుంచింది.

బౌలర్లు చెలరేగిపోతున్నపిచ్‌పై ఇంగ్లాండ్ ఈ స్కోరు ఛేదించడం కష్టమేనని చాలా మంది భావించారు. అయితే ఓపెనర్లు  జాక్ క్రాలే , బెన్ డకెట్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 6.1 ఓవర్లలోనే 51 పరుగులు జోడించారు. వీరిద్దరూ వన్డే తరహా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లాండ్ స్కోరు ఫస్ట్ గేర్‌లో సాగింది. డకెట్ 34 ( 4 ఫోర్లు, 1 సిక్స్) పరుగులకు ఔటయ్యాడు. బ్రైెడెన్ కార్స్ (6) త్వరగానే ఔటైనా.. బెథెల్, క్రాలే ఇన్నిం గ్స్ కొనసాగించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

క్రాలే 37 ( 3 ఫోర్లు, 1 సిక్స్ ) , బెథెల్ 40 (5 ఫోర్లు) పరుగులు ఔటవగా మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతున్నట్టు కనిపించింది. ఈ దశలో హ్యారీ బ్రూక్  , జేమీ స్మిత్ జట్టు విజయాన్ని పూర్తి చేశారు. దీంతో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. అలాగే 5,468 రోజుల తర్వాత ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ టెస్ట్ విజయాన్ని రుచి చూసింది. ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యాన్ని 1-3కు తగ్గించగలిగింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ను దెబ్బకొట్టిన జోష్ టంగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. సిరీస్‌లో చివరి మ్యాచ్ జనవరి 4 నుంచి సిడ్నీ వేదికగా మొదలవుతుంది.

స్కోరు బోర్డు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 152 ( నెసర్ 35, ఖవాజా 29, అలెక్స్ క్యారీ 20; జోష్ టంగ్ 5/45, ఆట్కిన్సన్ 2/28)

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 110 ( బ్రూక్ 40, ఆట్కిన్సన్ 28, స్టోక్స్ 16; నెసర్ 4/45, బొలాండ్ 3/30, స్టార్క్ 2/23)

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 132 ( హెడ్ 46, స్మిత్ 24 నాటౌట్, గ్రీన్ 19; బ్రైడెన్ కార్స్ 4/34, స్టోక్స్ 3/24, జోష్ టంగ్ 2/44)

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 178/6 ( బెతెల్ 40, క్రాలే 37, డకెట్ 34; స్టార్క్ 2/55, బొలాండ్ 2/29, రిచర్డ్స్‌న్ 2/22)