ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి
సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని యాచారం గ్రామంలో సోమవారం ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో సంగెం అజిత్ (9) అనే బాలుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి గ్రామానికి చెందిన సంగేమ్ అజిత్ స్థానిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. మండలంలోని యాచారం గ్రామం వద్ద బాలుడిని ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడిని తక్షణమే చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రికి చేరుకునే సరికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు, చంద్రాయన్ పల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటన అనంతరం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు స్వీకరించి, దాని ఆధారంగా ట్రాక్టర్ డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ ఐ పుష్పరాజ్ తెలిపారు.






