వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
శోకసంద్రంలో తల్లిదండ్రులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 5 (విజయక్రాంతి): నగరంలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. ఒంటరిగా పిల్లలు కనిపిస్తే చాలు దాడి చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్న దంపతుల కుమారుడు సాత్విక్(6) మంగళవారం రాత్రి ఆడుకుంటూ బయటకు వెళ్లి కనిపించకుండా పోయాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో బుధవారం ఉదయం స్థానికంగా ఉండే డంపింగ్‌యార్డు వద్ద కుక్కలు అధికంగా ఉండడం గమనించిన స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా బాలుడి మృతదేహం కనిపించింది. బాలుడి శరీరమంతా గాయాలై మృతిచెంది ఉన్నాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగి పోయారు. కుక్కలను నియంత్రించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






